Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సంక్షేమ పథకాల (Welfare Schemes) పాతర.. కుంభకోణాల జాతర నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినట్లు, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

మహేశ్వరంలో (Maheshwaram) మరోసారి సబితమ్మ గెలుపు తథ్యమని తేలిపోయిందన్నారు. తెలంగాణ నలుదిశలా ఒకే నినాదం “కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె” మారుమోగుతోందని చెప్పారు. రాష్ట్రంలో వికాసం పోయిందని.. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలిందని మండిపడ్డారు. కేసీఆర్ కిట్ (KCR KIT) పోయింది.. కరెంటు కోతల కాలం వచ్చిందన్నారు. రైతుబంధు పోయి రాహుల్ బంధు వచ్చిందని ఎద్దేవా చేశారు.

ప్రజలు ఆలోచించాలి..

ప్రజాసంక్షేమం.. ప్రగతిపథం.. రెండు జోడెడ్లలా ముందుకుసాగిన రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారో ఆలోచించాలని అన్నారు. కేసీఆర్ కు పదవులు కొత్త కాదని.. ఎన్నో పదవులను త్యాగం చేశారని గుర్తు చేశారు. 50 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కేసీఆర్ సొంతమని.. కేంద్ర కేబినెట్ మంత్రి వరకూ అన్ని పదవుల్లోనూ ఆయన పనిచేశారని చెప్పారు. మేఘాలయ సీఎం కాన్రాడ్ కే సంగ్మా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చి.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (ICCC)ను చూసి ఆశ్యర్యపోయారని అన్నారు. కాన్రాడ్ కే సంగ్మా తనకు స్వయంగా ఫోన్ చేసి, కేసీఆర్ దార్శనికత అద్భుతమని కొనియాడారని కేటీఆర్ (KTR) అన్నారు.

రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది హిట్లర్ రెడ్డి..

రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయ్యాడని ఆగ్రహించారు. ఓ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చుట్టుపక్కల ఉన్న వారికి నష్టం కలుగుతోందని.. అదే పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఓ హిట్లర్ రెడ్డి అని మండిపడ్డారు. తనకు హిట్లరే ఆదర్శం అని రేవంతే స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు.

దరిద్రాలన్నీ మళ్ళీ దాపురించాయి..

తమ ప్రభుత్వం వచ్చాక రైతుబంధు రూ.15 వేలు చేస్తా అని రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టాడని.. 420 అబద్ధాలతో ఆగంచేసి గద్దెనెక్కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు దేవుడెరుగు, కనీసం యూరియాకు రాష్ట్రంలో దిక్కులేదని ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నాటి దరిద్రాలన్నీ మళ్ళీ దాపురించాయని మండిపడ్డారు. షాపులో కాదు.. యూరియాను యాపులో పెడ్తం అని మోసం చేశారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలేనన్ని అబద్ధాలతో మభ్యపెట్టారని విమర్శించారు. రేవంత్ రజనీకాంత్‌ను మించిన డైలాగులు కొడితే.. భట్టి విక్రమార్క కమల్ హసన్‌ను మించి యాక్టింగ్ చేశారని ఎద్దేవా చేశారు. వంద రోజులు గ్యారెంటీ కార్డు జాగ్రత్తగా పెట్టుకోమన్నారని.. రెండున్నరేళ్లయినా నాలుక గీసి పరేయడానికి కూడా ఈ గ్యారెంటీ కార్డు పనికి రావడంలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూముల పట్టాలిస్తామని దగా చేశారని అన్నారు.

Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>