కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రణాళికలో భాగంగా చీఫ్ సెక్రటరీ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారులను కీలక స్థానాలకు బదిలీ (IAS Transfers) చేసింది. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఈ నెల 30న రిటైర్ కానుండడంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా సంజయ్ జాజును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి కార్యాలయం టీమ్‌ను మరింత స్ట్రాంగ్ చేస్తూ పక్కా వ్యూహంతో పోస్టింగ్‌ల నిర్ణయం తీసుకున్నది.
ఇంతకాలం సీఎంఓలో ఒకే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండగా ఇప్పుడు అదనంగా ఎన్.శ్రీధర్‌ను నియమించింది. వీరిద్దరిపైన రిటైర్ కానున్న రామకృష్ణారావును ఎక్స్ అఫీషియో హోదాలో సలహాదారుగా నియమించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఫస్ట్ స్టెప్‌గా సీఎంఓ పునర్ వ్యవస్థీకరణతో మొదలుపెట్టింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి పెట్టి సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వడంలో వ్యూహాత్మంగా వ్యవహరించింది.
సీఎం స్ట్రాంగ్ టీమ్ సీఎస్ నియామకంతో స్టార్ట్ :
కేవలం చీఫ్ సెక్రటరీ మార్పుగానే దీన్ని చూడరాదని, రెండేండ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ‘టీమ్ రీసెట్’ చేస్తున్నారన్న కామెంట్ సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న కొన్ని కీలకమైన, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, పెట్టుబడులు రాబట్టడంపైనా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళే సమయానికి కొన్ని డ్రీమ్ ప్రాజెక్టుల పనులు మొదలుకావడం, పెండింగ్‌లో ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ లాంఛనంగా ప్రారంభం కావడం, వీటికి అవసరమైన నిధులను సిద్ధం చేసుకోవడం ప్రభుత్వానికి అనివార్యమవుతున్నది.
కేంద్ర-రాష్ట్ర వ్యవహారాల్లో కీలక భూమిక పోషించేలా సంజయ్ జాజును (Sanjay Jaju) చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేసుకోవడం, రామకృష్ణారావును (Ramakrishna Rao) సీఎం టీమ్‌లో ఉంచడం, ఇక్కడ ఉన్న స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ అనే కొత్త విభాగానికి సీఈఓగా నియమించడం.. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే వ్యూహంలో భాగమనే వాదన కూడా వినిపిస్తున్నది.
సెకండ్ హాఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రాటెజీ :
ఎన్నికలకు రెండేళ్ల ముందే పరిపాలన, పెట్టుబడులు అనే ద్విముఖ వ్యూహాన్ని ప్రభుత్వం ఎంచుకున్నది. చీఫ్ సెక్రటరీ మొదలు ఐఏఎస్‌ల బదిలీ (IAS Transfers) వరకు ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులు కేవలం మార్పులకే పరిమితం కాదని, దాని వెనుక సీఎం చేపడుతున్న ‘సెకండ్ హాఫ్’ పరిపాలనా వ్యూహం దాగి ఉన్నదనే చర్చ అటు అధికార, రాజకీయ వర్గాల్లోనే కాక సచివాలయ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నది. కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం ఆ బాధ్యతలకు మాత్రమే పరిమితం కాకుండా అదనపు బాధ్యతలనూ ప్రభుత్వం అప్పగించింది.
పరిశ్రమలు-ఐటీ శాఖలు, ఇన్వెస్ట్ మెంట్ సెల్, ‘స్పీడ్’ .. ఇలాంటి బాధ్యతలను కూడా అప్పగించింది. ఆదాయాన్ని ఆర్జించే వివిధ విభాగాలను పటిష్టం చేయడంలో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీ తరచూ దిశానిర్దేశం చేస్తున్నది. ఇప్పుడు గనుల శాఖ నుంచి గరిష్ట స్థాయిలో ఆదాయాన్ని తెచ్చుకునేలా దానిపై అనుభవం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎన్.శ్రీధర్‌ను సీఎంలోకి తెచ్చింది.
పరిపాలన అంతా ఇకపైన సీఎంఓ నుంచే :
సీఎంఓలో చోటుచేసుకుంటున్న మార్పులు, అధికారుల బదిలీలు, కొత్తవారికి ప్రవేశం, చీఫ్ సెక్రటరీ ఎంపిక… ఇవన్నీ పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, ఆదాయాన్ని ఆర్జించడానికి రూపొందించుకున్న ప్లానింగ్.. ఇవన్నీ పరిపాలనను స్పష్టమైన డైరెక్షన్‌లోకి తీసుకెళ్ళడానికి నిదర్శనమన్నది ఆ వర్గాల అభిప్రాయం.
కొత్త చీఫ్ సెక్రటరీ చుట్టూ అధికార యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించడం; ఎన్నికలకు ముందు రెండేళ్లలో పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమల ఏర్పాటు, ఫ్లాగ్‌షిప్ పథకాల అమలులో వేగాన్ని పెంచడం, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇకపైన రాజకీయ, పరిపాలనా సమన్వయ కేంద్రంగా మార్చడం.. ఇలాంటివన్నీ ఈ బదిలీలను చూస్తే అర్థమవుతున్నదని వ్యాఖ్యానించాయి. పెట్టుబడుల విషయంలో చీఫ్ సెక్రటరీకి అదనంగా మూడు బాధ్యతలు ఇవ్వడం, ఇప్పటివరకూ సీఎంఓలో ఉన్న అజిత్‌రెడ్డిని సీఈఓగా ఇన్వెస్ట్ తెలంగాణ అనే విభాగానికి నియమించడం.. ఇవన్నీ దానికి సంకేతాలు అని పేర్కొన్నాయి.
‘డెలివరీ మోడ్’లోకి ప్రభుత్వ యంత్రాంగం :
ప్రభుత్వానికి మిగిలిన రెండున్నరేళ్ల సమయం కీలకంగా మారింది. మొదటి రెండేళ్లు ఎన్నికల హామీల అమలు, ఆర్థిక సమీకరణ, ప్రభుత్వ విభాగాల సమీక్షలు, నామినేటెడ్ పోస్టుల మంజూరు.. ఇలాంటి అవసరాలకే సరిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రే మొదటి రెండేండ్ల గురించి వివిధ సందర్భాల్లో వెల్లడించారు. మిగిలిన రెండున్నరేళ్ల కాలాన్ని ‘డెలివరీ – విజిబిలిటీ’ పీరియడ్‌గా ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాజెక్టులు వేగంగా పూర్తికావాలి, పరిశ్రమల పెట్టుబడులు రాష్ట్రానికి రావాలి, యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభించాలి, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతిఫలించాలి, వీటికి అవసరమైన నిధులను కేంద్ర గ్రాంట్లు మొదలు వివిధ రూపాల్లో సమకూర్చుకోవాలి, పన్నులు-రాయల్టీ-సీనరేజీ.. ఇలాంటి రూపాల్లో సొంత ఆదాయాన్ని పెంచుకోవాలి.. ఇవన్నీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నాయి. వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీలతో కొన్ని విభాగాల హెడ్‌ల మార్పు చోటుచేసుకోవచ్చనే మాటలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. సెన్సస్ ఆంక్షలు వచ్చే ఏడాది ముగియగానే జిల్లాల స్థాయిలోనూ భారీ స్థాయిలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది.
Read Also: ఆ డైరీలో ఏముంది? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన డైరీ పేజీలు
Follow Us On: Instagram

