కలం, నిజామాబాద్ బ్యూరో: కాలాపానీ జైలు.. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో బ్రిటిష్ ప్రభుత్వం 1896-1906 మధ్య నిర్మించి సెల్యులార్ జైలు. సముద్రం దాటి వెళ్తే తిరిగి రావడం కష్టం కాబట్టి దీనికి “కాలాపానీ” అనే పేరు వచ్చింది. వందల మంది విప్లవకారులను ఇక్కడే బంధించి కఠిన శిక్షలు విధించారు. “ఉరి కన్నా భయంకరమైనది” అని పేరు పొందిన ఈ జైలు.. చిత్ర హింసలకు పర్యాయపదంగా మారింది. అలాంటి కాలాపానీ లాంటి జైలు నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఉందంటే నమ్మగలరా..! అవును, గోదావరి ఒడ్డున వెలిసిన ఇటుక బట్టీలు అచ్చం జైలును తలపిస్తున్నాయి. బానిసత్వ సామ్రాజ్యాన్ని సృష్టించి ఏళ్ల తరబడి నడిపిస్తున్న వ్యవహారం జడ్జి చొరవతో బయటపడింది.
యజమానులను ప్రశ్నిస్తే.. చావబాదుతారు!
నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలూరు మండలం దేగాం, ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామాల్లో ఏర్పాటైన ఇటుక బట్టీల్లో సుమారు 1000 మంది కార్మికులు గత 15 ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తూ కట్టు బానిసలుగా మారారు. వీరంతా ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు, నెల్లూరు జిల్లాకు చెందినవారు. బ్రోకర్లు వీరిని తీసుకొచ్చి ఇటుక బట్టీల్లో అప్పగించి వెళ్లిపోయాఆరు. యజమానులు, అక్కడ నిర్వాహకులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ప్రశ్నిస్తే.. పైశాచికంగా దాడి చేయడం, ఆడ, మగా, పిల్లలు అన్న తేడా లేకుండా మట్టిలో వేసి పశువులను కొట్టినట్టుగా కొడుతున్నారు.
కూలీలనే బెదిరించిన పోలీసులు..
పోలీస్, లేబర్, రెవెన్యూ, మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. లంచాల మత్తులో మునిగిపోయినవారిని మామూళ్లు ఇచ్చి బట్టీ యజమానులు తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని దాష్టీకాలు సాగిస్తున్నారు. గతంలో ఫిర్యాదులు చేస్తే ఇటుక బట్టీల వద్దకు వచ్చిన పోలీసులు కూలీలనే బెదిరించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి బాబు అనే కార్మికుడు ధైర్యం చేసి హై కోర్టులోని రాష్ట్ర లీగల్ సర్వీసు అథారిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా జడ్జి జీవీఎన్.భారతలక్ష్మి అధికారుల బృందంతో ఇటుక బట్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 600 మంది కార్మికులకు విముక్తి కల్పించారు. వారిని ఆర్మూర్‌లోని ఒక ఫంక్షన్ హాలుకు తరలించి అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు.
పిల్లలు ఓ చోట.. తల్లిదండ్రులు మరో చోట..
జిల్లా జడ్జి పరిశీలనలో గుండె తరక్కుపోయే వారి వెతలు వెలుగులోకి వచ్చాయి. కూలీల పిల్లలను ఒక రేకుల షెడ్డులో కట్టేసి, వాళ్ల తల్లిదండ్రులను మరో చోటకు తీసుకెళ్లి రేయింబవళ్లు పనులు చేయిస్తున్నారు. ఇక చిన్నారులకు చదువు, పౌష్టికాహారం అనే మాటే లేదు. 12 ఏళ్లు దాటిన పిల్లలను సైతం వెట్టిచాకిరీ చేయించారు. ఒక మహిళకు ఇప్పటికే అయిదుగురు పిల్లలు. ఆమె మళ్లీ గర్భం దాల్చగా.. బయటకు వెళ్లకుండా ఇక్కడే పనులు చేయించారు.. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఇక్కడే అనారోగ్యంతో నలుగురు కూలీలు మరణించడం గమనార్హం.
‘వారి శవాలు ఏమయ్యాయో తెలియదు..’
కనీస వేతనాలు ఇవ్వకుండా, సరైన ఆహారం పెట్టకుండా, పని ప్రదేశంలో భద్రతా చర్యలు తీసుకోకుండా, జంతువుల కంటే హీనంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దాదాపు 1000 మంది కార్మికులతో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రోజుకు 20 గంటల పాటు పనిచేయిస్తున్నారు. శీతాకాలంలో వచ్చి ఎండకాలం చివరి వరకు ఇటుక తయారీ పనిచేస్తున్నామని బాధితులు తెలిపారు. హక్కులపై మాట్లాడితే ప్రాణాలు తీస్తున్నారని, ఇప్పటి వరకు దాదాపు నలుగురు కార్మికులు ఇక్కడే చనిపోయారని, వారి శవాలను సైతం ఏమి చేశారో తెలియదని వాపోయారు. జిల్లా జడ్జి ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యు, కార్మిక శాఖ అధికారుల బృందం ఇటుక బట్టీల్లో పని చేస్తున్న 600 మంది వరకూ విముక్తి కల్పించారు.

