నేటితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Assembly sessions) సోమవారంతో ముగియనున్నాయి. ఈనెల 16న ప్రారంభమై 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. సోమవారం చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాగ్ నివేదిక కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. సభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనుంది. గత 10 రోజులుగా సాగిన బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల కౌంటర్లతో దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేయగా.. అధికార పక్షం సైతం ధీటుగా స్పందించింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువు సభ్యులతో సహా సీఎం రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) 2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో ఏ శాఖకు ఎంత కేటాయించారనే దానిపై కూలంకుషంగా చర్చ జరిగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు రాష్ట్ర బడ్జెట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ రంగానికి మేలు చేకూరే విధంగా బడ్జెట్ లేదని విమర్శించారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy) సైతం వీరి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష సభ్యులకు ధీటైన కౌంటర్లు ఇచ్చారు.

ఇక బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఇప్పసారా వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపాయి. మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం చాలా పథకాలకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెడుతోందని, అయితే ఒకవేళ ఈ ఇప్పసారాను ప్రభుత్వం తయారు చేస్తే దానికి మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టవద్దని రాకేశ్ రెడ్డి సెటైర్ వేశారు. దీంతో సభ ఒక్కసారి హీటెక్కింది. సారా వంటి అంశంపై మాట్లాడుతున్నప్పుడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరును తీసుకురావడం మహిళా లోకాన్ని, దేశ నాయకురాలిని అవమానించడమేనని కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తీవ్రంగా మండిపడ్డారు.

గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. మైనింగ్ శాఖపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు రాఘవ కన్స్ట్రక్షన్ పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో దారుణంగా మైనింగ్ చేస్తూ అక్రమాలు పాల్పడుతూ రూ. కోట్లు దన్నుకుంటున్నారని ఆరోపించారు. ఈ సంస్థ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదని, అందుకే యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై సీఎం రేవంత్ సైతం ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి రాష్ట్రంలోని అన్ని మైనింగ్ అక్రమాలపై విచారణకు సీబీ సీఐడీకి ఆదేశిస్తున్నామని స్పష్టం చేశారు. ఆదివారం కూడా బీఆర్ఎస్ సభ్యులు ఇదే విషయంపై హౌస్ కమిటీ వేయాలని పట్టుబడటంతో కాంగ్రెస్ సభ్యులు విరుచుకుపడ్డారు. ఒకరికి ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు సభను ఇబ్బంది పెడుతున్నారని, సభా నియమాలను ఉల్లంఘించారని పేర్కొంటూ కేటీఆర్, హరీశ్ రావుతో సహా 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రెండురోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>