కలం, యాదగిరిగుట్ట: పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీ లిమిటెడ్ కార్మికుల వేతన ఒప్పందంలో సరికొత్త చరిత్ర సృష్టించామని పీఈఎల్ విభాగం బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి (Gongidi Mahender Reddy) ప్రకటించారు. ఆదివారం కంపెనీ యాజమాన్యంతో కలిసి బీఎంఎస్ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, ఇతర కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో వేతన ఒప్పంద వివరాలను వెల్లడించారు. కార్మిక సంఘాలు, కంపెనీ కార్మికులు ముక్తకంఠంతో మెచ్చేలా ఈ ఒప్పందం కుదిరినందుకు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కుదిరిన ఈ మూడో వేతన ఒప్పందంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మహేందర్ రెడ్డి వివరించారు. సీనియర్ కార్మికుల ప్రస్తుత వేతనంపై అదనంగా రూ.8,883 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో రూ.8.80గా ఉన్న వీడీఏపై మరో 20 పైసలు పెంచి రూ.9కి చేర్చారని తెలిపారు.
కార్మికుల ఇన్సూరెన్స్ చెల్లింపును రూ.4 వేల నుంచి రూ.5వేలకు పెంచారని, కార్మికుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో బీమా చేసుకున్నా సరే, ఆ సంస్థకు కంపెనీ తరపున రూ.5 వేలు అందిస్తారని పేర్కొన్నారు. కార్మికులకు మెయింటెనెన్స్ అలవెన్స్ కింద రూ.50, స్టాఫ్ అలవెన్స్ కింద రూ.50, ఇతర విభాగాలకు రూ.25 చొప్పున అలవెన్సులు ఖరారు చేశారన్నారు. కంపెనీలో పనిచేసే కార్మికుడు ఒకవేళ నెల మొదటి వారంలో ఉద్యోగ విరమణ (రిటైర్మెంట్) చేసినా.. ఆ నెల పూర్తి వేతనాన్ని చెల్లించేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే ఉంటామని, గతంలో ఏ గుర్తింపు సంఘం కూడా ఈ స్థాయిలో వేతన ఒప్పందం చేయలేదని చెప్పుకొచ్చారు. కంపెనీలో గుర్తింపు సంఘంగా బీఆర్ఎస్కేవీ గెలుపొందిన తర్వాత ఇప్పటివరకు మూడు వేతన ఒప్పందాలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అందులో ఈ 3వ ఒప్పందం కనీవిని ఎరుగని రీతిలో జరిగిందని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా కంపెనీలో పనిచేసే మహిళా కార్మికులకు పనిభారం లేకుండా చేయడంతోపాటు వారికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పించామని హామీ ఇచ్చారు. ఈ చారిత్రాత్మక వేతన ఒప్పందానికి పూర్తి స్థాయిలో సహకరించిన సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ సంఘాల నాయకులకు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్మికులకు గొప్ప మేలు చేకూర్చిన బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డిని కార్మికులు భారీ గజమాలతో ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు చాటుకున్నారు.

