Mobile Popup Ad
Mobile Popup Ad

యథేచ్ఛగా అక్రమ వ్యాపారం.. జోరుగా ‘జీరో’ దందా!

కలం, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘జీరో మాల్’ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను (GST Evasion Scam) ఎగవేస్తూ కోట్ల రూపాయల విలువైన సరుకులను జిల్లాలోకి అక్రమంగా కొందరు వ్యాపారులు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. కమర్షియల్ టాక్స్, విజిలెన్స్, పోలీసు శాఖల పర్యవేక్షణ లోపాలను ఆసరాగా చేసుకుని, రోజుకు సుమారు రూ.200 కోట్ల మేర జీరో బిజినెస్ జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా కేంద్రాలతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, వేములవాడ, కోరుట్ల, ధర్మపురి తదితర పట్టణాల్లో జీరో వ్యాపారం విస్తరించినట్లు తెలుస్తోంది.

వినియోగదారులకు జీఎస్టీ బిల్లులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, పన్ను ఎగవేత కోసం కొందరు వ్యాపారులు తెల్లకాగితాలపై చేతిరాతతో రాసిన చీటీలనే బిల్లులుగా ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి సరుకులు జిల్లాకు చేరుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారానికి ఇతర రాష్ట్రాల వ్యాపారులే ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. నిషేధిత గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులు కూడా ఇదే మార్గంలో జిల్లాలోకి చేరుతున్నట్లు పలువురు చెబుతున్నారు.

కన్ఫెక్షనరీ నుంచి కిరాణా వరకు

చిప్స్, బూందీ, కారా, స్థానికంగా తయారయ్యే స్నాక్స్ వంటి కన్ఫెక్షనరీ ఉత్పత్తులు అధికంగా జీరో మాల్ కింద జిల్లాకు చేరుతున్నాయి. కిరాణా, హోల్‌సేల్ వ్యాపారాల్లో కూడా కొంత భాగం బిల్లులతో, మరికొంత భాగం పూర్తిగా బిల్లులు లేకుండానే సరఫరా అవుతున్నట్లు సమాచారం. గుట్కా, సిగరెట్ల వ్యాపారం దాదాపు పూర్తిగా జీరో మాల్ ద్వారానే సాగుతోంది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తుల్లో నకిలీ సరుకులు కూడా ఉండటంతో వినియోగదారులు మోసపోతున్నారు. జనరల్ స్టోర్లకు సంబంధించిన వస్తువులే రోజుకు కోట్ల రూపాయల టర్నోవర్‌తో జీరో మాల్ గా చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.

నకిలీ వస్తువుల ముప్పు

జీరో సర్క్యూట్ ద్వారా కేవలం పన్నుల ఎగవేత మాత్రమే కాకుండా, నకిలీ వస్తువుల చలామణీ కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లు, పాన్ మసాలా, నిత్యావసరాలు, బట్టలు, ప్లాస్టిక్ సామగ్రి, స్టీల్ ఉత్పత్తులు, మొబైల్ యాక్ససరీస్, టైల్స్, ఇసుక, సిమెంట్, ఐరన్, ఎలక్ట్రికల్ పరికరాలు వంటి అనేక వస్తువులు సరైన బిల్లులు లేకుండానే మార్కెట్‌లోకి వస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్స్ విడిభాగాల్లో దాదాపు 90 శాతం వరకు, వాహనాల విడిభాగాల్లో కూడా భారీగా నకిలీ వస్తువులే ఉంటున్నాయి. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నాసిరకం వంటనూనెలను విక్రయిస్తూ వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తనిఖీల్లో నిర్లక్ష్యమే కారణం

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత స్థానికంగా వాణిజ్య పన్నుల తనిఖీలు తగ్గిపోయాయి. ఉమ్మడి జిల్లాలో వ్యాపారాలు రూల్స్ ప్రకారం సాగుతున్నాయా? ప్రభుత్వానికి సరైన పన్నులు చెల్లిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత శాఖలు తగిన దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలో ఉన్న లోపాలను కొందరు వ్యాపారులు అవకాశంగా మలుచుకుని జీరో మాల్ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మామూళ్ల మత్తులో అధికారులు

వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్, పోలీసు శాఖలకు కొందరు అక్రమ వ్యాపారులు మామూళ్లు చెల్లించడం వల్లే ఈ దందా జోరుగా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పన్నుల ఎగవేతతో ప్రభుత్వానికి నష్టం కలిగించడమే కాకుండా, నాసిరకం ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతున్నారని పేర్కొంటున్నారు. ఆటోమొబైల్, నిర్మాణ రంగాలతో పాటు ఆహార ధాన్యాలు, పప్పుదినుసులు, వంటనూనెలు, మసాలా దినుసుల వ్యాపారాల్లో కూడా అక్రమాలు పెరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లనే కేంద్రాలుగా చేసుకుని నాసిరకం ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారని తెలుస్తోంది.

తయారీదారులు కల్తీ నూనెలు, డాల్డా, నాసిరకం మసాలాలు ఉపయోగిస్తూ రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. ప్యాకెట్లపై తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల వివరాలు కూడా ముద్రించకుండా అమ్ముతున్న ఘటనలు పట్టుబడిన సందర్భాల్లో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి.. అక్రమ రవాణా, జీఎస్టీ ఎగవేతపై టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టాలని, నకిలీ సరుకుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అవసరం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న జీరో మాల్ దందాపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు అంటున్నారు. జీఎస్టీ ఎగవేత (GST Evasion Scam), అక్రమ రవాణా, నకిలీ సరుకుల విక్రయాలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
నకిలీ ఉత్పత్తుల తయారీదారులు, అక్రమ రవాణాదారులు, పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే దందాకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తనిఖీలు నిర్వహిస్తున్నాం

అయితే ఈ దందాపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు అంటున్నారు. వే బిల్లులు, ఇన్ వాయిస్ లేని షాపులపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిస్తున్నారు. జీరో దందాపై దృష్టికి రాగానే కమిషనర్ ఆదేశాలతో వెంటనే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, పెద్దపల్లిలో 1, 2 సీటీవో ఆఫీసులు, సిరిసిల్లలో 1, కరీంనగర్ లో ఎల్ టీయూ ఆఫీసులు ఉండగా.. కమిషనర్ రీ ఆర్గనైజేషన్ చేశామని.. జీరో దందాపై ఉపేక్షించమని కరీంనగర్ ఏసీటీవో అనిల్ హెచ్చరించారు.

Read Also: CM రేవంత్ ధీమా.. ఎమ్మెల్యేల్లో డైలమా.. కారణమదేనా??

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>