కలం, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వం కౌలు రైతుల (Tenant Farmers) ను గుర్తించడంలో విఫలమైందని, అధికారంలోకి వస్తే తమను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత రెండున్నరేండ్లుగా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నదని ‘కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ ఆరోపించింది. రాష్ట్రంలోని 22 జిల్లాల పరిధిలో 47 మండలాల్లో సర్వే నిర్వహించి, 1,816 మంది రైతుల అభిప్రాయాలను సేకరించిన ఈ కమిటీ.. మంగళవారం హైదరాబాద్లో తన నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 32 శాతం మంది కౌలు రైతులేనని, ఇందులోనూ దాదాపు సగం మంది (47శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినవారేనని ఈ నివేదిక వెల్లడించింది. వ్యవసాయ రంగంలో అసలైన సాగుదారులు కౌలు రైతులేనని ఈ నివేదిక ఆవిష్కరణ సందర్భంగా పలువురు రైతు సంఘాల నాయకులు, మేధావులు స్పష్టం చేశారు.
స్టడీలో ఏం తేలిందంటే..
- భూ యజమానులకు పలు పథకాల ద్వారా లబ్ధి కలుగుతున్నా.. కౌలు రైతులకు మాత్రం ఆదరణ కరువైంది.
- రైతుబంధు సాయం భూయజమానులకు చేరిందని, తద్వారా కౌలు రేట్లు తగ్గుతాయన్న గత ప్రభుత్వ వాదన వాస్తవ విరుద్ధమని సర్వే తేల్చి చెప్పింది.
- రాష్ట్రంలో సగటున ఎకరానికి కౌలు రూ. 14,936 ఉండగా, కొన్ని చోట్ల ఇది రూ. 53 వేల వరకు ఉన్నట్లు తేలింది.
- ప్రకృతి వైపరీత్యాల వల్ల 85.2 శాతం మంది కౌలు రైతులు పంట నష్టపోయినా.. వారికి పరిహారం అందడం లేదు.
- బ్యాంక్ రుణాలు అందక 24 శాతం వడ్డీతో ప్రైవేట్ అప్పులు చేస్తూ.. రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయారు.
- రుణమాఫీ కూడా భూ యజమానులకే పరిమితం కావడంతో కౌలు రైతులకు ఏమాత్రం ఊరట లభించడం లేదు.
సబ్సిడీ యూరియా అందట్లేదు..
యూరియా కోసం ప్రభుత్వం తెచ్చిన మొబైల్ యాప్లో భూ యజమాని ఫోన్కు వచ్చే ఓటీపీ తప్పనిసరి కావడం కౌలు రైతులకు పెద్ద అడ్డంకిగా మారింది. సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 22.8 శాతం మందికే సబ్సిడీ యూరియా దక్కింది. సొంతంగా పొందిన వారు కేవలం 40 మందే కాగా, మిగిలిన వారంతా యజమానులపై ఆధారపడాల్సి వస్తున్నది. దీంతో కౌలు రైతులు బయట మార్కెట్లో రూ. 500 పెట్టి యూరియా కొనాల్సి వస్తున్నది. పైగా సబ్సిడీ యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నది.

