కలం, మెదక్ బ్యూరో : మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను నిలిపివేయడంతో ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో వేలాది మంది కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీల విస్తరణతో పాటు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కారణంగా అనేక గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. దీంతో ఆయా గ్రామాలు పంచాయతీ హోదాను కోల్పోయాయి. అయితే విలీన గ్రామాలు పేరుకే మున్సిపాలిటీల్లో (Jinnaram Municipality) ఉన్నప్పటికీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలుగానే ఉన్నాయి.
వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామస్తులకు ఉపాధి హామీ పనులే ప్రధాన ఆధారంగా ఉండేవి. జాబ్ కార్డులు కలిగిన కూలీలకు ఏడాదికి 120 రోజుల వరకు పని లభించడంతో పాటు రోజుకు సుమారు రూ.300 వరకు కూలి వచ్చేది. ఆ ఆదాయంతోనే కుటుంబాలు జీవనం సాగించేవి. అయితే మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను నిలిపివేయడంతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా బదిలీ అయ్యాయి. దీంతో వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పేరుకే మున్సిపాలిటీ..
ఉమ్మడి జిల్లాలోని అనేక మున్సిపాలిటీలు ఇప్పటికీ పూర్తిగా గ్రామీణ ప్రాంతాలుగానే ఉన్నాయి. పేరుకే మున్సిపాలిటీలు మారినప్పటికీ, అక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం, వ్యవసాయ కూలీ పనులే. ఇప్పుడు ఉపాధి హామీ లేకపోవడం, మరోవైపు ఇతర ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులో లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చాయనే కారణంతో ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేయడం సరికాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాలుగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పనుల ద్వారా కనీస ఆదాయం లభించేదని, కానీ మున్సిపాలిటీల్లో విలీనమైన తర్వాత పనులు లేక జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారడం తప్ప తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి మార్పులు కనిపించడంలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉన్న ఉపాధి కూడా పోయి..
సంగారెడ్డి జిల్లాలో జిన్నారం మండల కేంద్రంతో పాటు సమీప గ్రామాలను కలుపుతూ కొత్త మున్సిపాలిటీ (Jinnaram Municipality)ని ఏర్పాటు చేశారు. ఇందులో ఊట్ల, కొడకంచి, అండూర్, రాళ్లకత్వా, మంగంపేట, జంగంపేట, శివనగర్, సోలాక్‌పల్లి గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామాలే. జిన్నారం మండలంలో 6 వేల మందికిపైగా ఉపాధి హామీ జాబ్ కార్డుదారులు ఉన్నారు. గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఉపాధి హామీ పనులు నిలిచిపోయి, వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు.
అలాగే కోహిర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారడంతో అక్కడ ఉన్న సుమారు 800 మంది జాబ్ కార్డుదారులకు ఉపాధి లేకుండా పోయింది. సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో కూడా దాదాపు వెయ్యి మంది ఉపాధి కూలీలు పనులు కోల్పోయారు. గతేడాది నుంచి పనులు లేకపోవడంతో జాబ్ కార్డులు కలిగిన కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా, వాటిలో 10కి పైగా మున్సిపాలిటీలు గ్రామీణ ప్రాంతాలుగానే ఉన్నాయి. మున్సిపాలిటీలుగా మారినా తమకు ఎలాంటి లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వలసలు పెరిగే ప్రమాదం..
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూలీలు, గ్రామస్తులు కోరుతున్నారు. విలీన గ్రామాల్లో ఉపాధి హామీ తరహా పనులు కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు సృష్టించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఉపాధి కోసం పెద్దఎత్తున వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, విలీన గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జిన్నారం మున్సిపాలిటీ వివరాలు..
మొత్తం జాబ్ కార్డులు – 5,689
నమోదైన మొత్తం కార్మికులు– 8,230
ఇందులో మహిళా కార్మికులు – 4,902
జిన్నారం మున్సిపాలిటీ (Jinnaram Municipality) పరిధిలో విలీనమైన గ్రామాల్లోనే 5,689 ఉపాధి హామీ జాబ్ కార్డులు, 8,230 మంది కూలీలు ఉన్నారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత ఉపాధి హామీ పనులు నిలిచిపోవడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: CM రేవంత్ ధీమా.. ఎమ్మెల్యేల్లో డైలమా.. కారణమదేనా??
Follow Us On: X(Twitter)

