కలం, వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి సూచించారు. శనివారం గోపాల్పేట (Gopalpeta) మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో నిర్వహించిన రైతు గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపికలో నీటి లభ్యత, పెట్టుబడి, మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని డా. చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి, భూసార పరీక్షలు, సూక్ష్మ నీటిపారుదల, ఫార్మ్‌పాండ్లు, ఇంకుడు గుంటల వినియోగాన్ని పెంచాలని సూచించారు. కందులు, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 34 శాతం మేర కరవు పరిస్థితులు నెలకొన్నాయని, జయన్న తిరుమలాపూర్‌లో 700 ఎకరాలు పూర్తిగా వర్షాధార సాగులో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక నీటి అవసరమున్న వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం రైతులకు ప్రయోజనకరమని సూచించారు. పంటల ప్రణాళిక రూపొందించే ముందు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, డివైఎస్‌వో సుధీర్‌రెడ్డి, మండల అధికారులు, సర్పంచ్ గోపాల్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

