కలం, తెలంగాణ బ్యూరో: “నేను మారాను.. మీరూ మారండి.. కొందరు ఎమ్మెల్యేలు జమీందార్ల తరహాలో వ్యవహరిస్తున్నారు. మీ అందరి ప్రోగ్రెస్ రిపోర్టు నా దగ్గర ఉన్నది.. క్షేత్రస్థాయిలో పర్యటించడంలేదు. ప్రజలను కలవడంలేదు..” ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించిన చేసిన కామెంట్లు ఇవి. సరిగ్గా గ్రౌండ్ లెవెల్‌లో సైతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. మరోసారి పవర్‌లోకి రావడం ఖాయమని సీఎం చాలా ధీమగా చెప్తున్నా.. ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి కనబడడంలేదు. దీనికి కారణం ప్రజలను ఎమ్మెల్యేలు కలవకపోవడమే. ఆ కలవకపోవడానికీ రీజిన్ ఉంది. అదే డీలిమిటేషన్ (Delimitation) సస్పెన్స్. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పుడు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ యథావిధిగా ఉంటుందో లేదో తెలియదు.. కొన్ని మండలాలు పోతాయేమో.. కొత్తవి కొన్ని వచ్చి చేరుతాయేమో.. రిజర్వేషన్ ఇప్పుడున్నదే కంటిన్యూ అవుతుందో లేదో.. ఇలాంటి సందేహాలతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ ఇలాకాల్లో యాక్టివ్గా ఉండటం లేదు.
ఎప్పుడూ స్థానిక ప్రజలతో టచ్లో ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఈ మధ్య అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం తమ సొంత సెగ్మెంట్లలో జరిగే పార్టీ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. డీలిమిటేషన్ (Delimitation) జరిగితే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం రాకపోవచ్చన్న భావనతో ఎమ్మెల్యేలు యాక్టివ్గా ఉండటం లేదు. డీలిమిటేషన్‌పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఆ మేరకు ఎమ్మెల్యేలు సైతం హడావిడి పడాల్సిన అవసరం లేదన్న మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కష్టపడి మండలాలు, గ్రామాల్లో తిరిగినా డీలిమిటేషన్ తర్వాత అవి పక్క నియోజకవర్గాల్లోకి వెళ్తే ఇప్పటివరకు చేసిన శ్రమ వృథా అవుతుందని, కొత్త మండలాల్లో గ్రౌండ్ జీరో నుంచి యాక్టివిటీస్ మొదలుపెట్టి ప్రజల కాన్ఫిడెన్స్ పొందడానికి కష్టపడాల్సి ఉంటుందన్నది ఆ ఎమ్మెల్యేల వాదన. నియోజకవర్గం భవిష్యత్ స్వరూపం ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితి ఉన్న టైమ్‌లో ఖర్చు పెట్టడానికి మానసికంగా సంసిద్ధంగా లేరు.
అంతా అయోమయం..
ఇప్పుడున్న నియోజకవర్గం ఇకపైన కూడా అదే సరిహద్దులతో కంటిన్యూ అవుతుందనే భరోసా ఉంటే కష్టపడి డెవలప్ చేసుకోవచ్చని, కానీ ఫ్యూచర్‌లో ఏమవుతుందో తెలియనప్పుడు హడావిడిగా పనిచేయాల్సిన అవసరం ఏంటన్నది ఎమ్మెల్యేల భావన. ఒక ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గాన్ని ఐదేండ్లు అభివృద్ధి చేస్తే తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉండేదని.. ఆ భరోసాతోనే అభివృద్ధి పనులు, పార్టీని బలోపేతం చేసుకోవడం, స్థానిక నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడం లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవాళ్లమని కొందరు లీడర్లు అంటున్నారు. కానీ డీలిమిటేషన్ తర్వాత ప్రస్తుత నియోజకవర్గం యథాతథంగా ఉంటుందా?.. సరిహద్దులు మారిపోతాయా?.. బలమైన ఓటు బ్యాంక్ ఇంకో నియోజకవర్గంలోకి వెళ్లిపోతుందా?.. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ మారిపోయి జనరల్ కేటగిరీ అవుతుందా?.. పోటీ చేసే అవకాశం ఉన్న ప్రాంతం కొత్తదవుతుందా?.. ఇలాంటి ప్రశ్నలను ఓ ఎమ్మెల్యే లేవనెత్తారు. అందుకే ‘వెయిట్ అండ్ వాచ్’ అనే ధోరణిని అవలంబిస్తున్నారు. సాధారణంగా ఎన్నికలకు రెండేండ్ల ముందే ప్రజల్లో తిరగడం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం లాంటి చర్యలతో యాక్టివ్ అవుతారు. ఇప్పుడు మాత్రం ‘ముందు డీలిమిటేషన్‌పై స్పష్టత రావాలి’ అనే ఫిలాసఫీలోకి ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలది మరో ఆలోచన..
ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి మరో రకంగా ఉన్నది. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భవిష్యత్తులో రాజకీయ లాభంగా మారుతుందన్న హామీ కనిపించడం లేదనే భావనతో సెగ్మెంట్లలో తిరిగేందుకు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఇప్పుడు ఎంత కష్టపడినా డీలిమిటేషన్ తర్వాత జనరల్ నుంచి రిజర్వులోకి వెళ్తే పోటీ చేయడానికి తనకు అవకాశం ఉండదన్నది కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే అభిప్రాయం. ఇంతకాలం నియోజకవర్గాన్ని బలమైన కోటగా మల్చుకున్నా డీలిమిటేషన్ తర్వాత తనకు పోటీ చేసే అవకాశం రాకపోయినా, కొంత ప్రాంతం పక్క నియోజకవర్గంలో కలిసినా పొలిటికల్ ఈక్వేషన్ మారిపోతుందని, సొంత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నది ఆయన వాదన. పార్టీ నిర్మాణం విషయంలోనూ ప్రస్తుత మండలాలు, గ్రామాల సమీకరణలు మారితే పార్టీ నిర్మాణాన్ని కూడా మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.
అభివృద్ధి పక్కకు..!
డీలిమిటేషన్ కన్‌ఫ్యూజన్‌తో ఎమ్మెల్యేలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో అభివృద్ధి పనుల్లో చురుకుదనం తగ్గుతున్నది. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం కనిపించడం లేదు. స్థానిక అవసరాల కోసం ప్రభుత్వం నుంచి నిధుల విడుదల, అధికారులపై ఒత్తిడి, ప్రత్యేక అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకురావడం వంటి అంశాలు కూడా ప్రభావితమవుతున్నాయి. డీలిమిటేషన్ కారణంతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుండడంతో అభివృద్ధి అజెండా పక్కకు పోతున్నది. డీలిమిటేషన్‌పై కేంద్రం నుంచి స్పష్టత లేకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం దాని ప్రభావం బలంగానే పడింది.

