కలం, వెబ్ డెస్క్ : భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఐపీఎల్ అభిమానులకు ఒక శుభవార్త అందించారు. 2027 ఐపీఎల్ (IPL 2027) సీజన్ నుంచి ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో చేరనున్నారు. ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్‌కు ఇది తొలి అధికారిక కోచింగ్ బాధ్యత కావడం విశేషం. వచ్చే రెండేళ్ల పాటు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఈ ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను చేపట్టనుండగా, జట్టు సపోర్ట్ స్టాఫ్‌ను సౌరవ్ గంగూలీ ముందుండి నడిపించనున్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు యువరాజ్ సింగ్ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి ధృవీకరించారు.
యువరాజ్ సింగ్ గతంలో పలువురు యువ ఆటగాళ్లకు వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అబ్దుల్ సమద్ వంటి యువ ప్రతిభలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సంజూ శాంసన్, రిషభ్ పంత్ వంటి స్టార్ ఆటగాళ్లతోనూ కలిసి పనిచేశారు. నెట్స్‌లో ఆటగాళ్లతో గంటల తరబడి గడుపుతూ, ఎండను సైతం లెక్కచేయకుండా మైదానంలోనే ఉండి మెంటార్‌గా మారడం యువరాజ్ ప్రత్యేకత. ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం పలువురు యువ ఆటగాళ్ల కెరీర్‌ను మలిచింది.
ఇప్పటికే ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు ఐపీఎల్‌లో కోచ్‌లుగా రాణించారు. ఇప్పుడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కూడా ఆ జాబితాలో చేరనుండటం గమనార్హం. యువరాజ్ సింగ్ చేరిక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో రాబోయే సీజన్లలో స్పష్టమవుతుంది.
Read Also: స్లాప్‌గేట్‌పై మళ్లీ రగిలిన వివాదం.. భజ్జీకి శ్రీశాంత్ ఛాలెంజ్
Follow Us On: Instagram

