కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ (YSRCP) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు(Petrol and Diesel Price Hike)పై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కీలక నేతలతో ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యకులు, పార్లమెంటు పరిశీలకులు, ఎమ్మెల్యే / సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని టీడీపీ చెప్పిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయించడం జరుగుతోందని ఫైర్ అయ్యారు. పెట్రో ధరలు మరింతగా పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింత భారమవుతోందన్నారు.
వైయస్ జగన్ ఆదేశాల మేరకు నిరసనలు..
ఈ తరుణంలో పార్టీ (YSRCP) అధినేత వైయస్ జగన్ (YS Jagan) ఆదేశాల మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని సజ్జల ప్రకటించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు / సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి, అనంతరం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ఇప్పుడు వారు ఇచ్చిన అదే హామీని అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రేపటి నిరసన కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతం చేయాలని చెప్పారు.పార్టీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకుని భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Read Also: తీర్థయాత్రకు వెళుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
Follow Us On: X(Twitter)

