కలం, వెబ్‌డెస్క్: భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో తీర్థయాత్రల (Tirtha Yatra) కు వెళ్లడం అనేది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అది ఆత్మశుద్ధిని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఒక పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్రతువు. అటువంటి తీర్థయాత్రలకు వెళ్లేటప్పడు మనం కొన్ని నియమాలను పాటించాలి. తగు జాగ్రత్తలు తీసుకుని, ఎలాంటి తప్పులు చేయడకూడదని సూచిస్తున్నారు పండితులు.
మహాభారతం ప్రకారం తీర్థయాత్రలు (Tirtha Yatra) ఆధ్యాత్మిక శుద్ధికి దోహదపడతాయి. అయితే తీర్థయాత్రలను సందర్శించేటప్పుడు నమ్మకం, ఇంద్రియ నియంత్రణ కీలకమని వాయుపురాణం చెబుతుంది. తీర్థయాత్రలు అనగానే దేవుడిని దర్శించుకోవడంతో పాటు పవిత్ర జలాల్లో స్నానం చేయడం కూడా ముఖ్యమైన ఘట్టం. పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల శారీరకంగా కొంత ఉపశమనం కలిగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద తీర్థయాత్రలు మానసిక ఉల్లాసానికి, ఆధ్యాత్మిక అనుభూతికి తోడ్పడతాయని సూచిస్తున్నారు. అయితే చాలామంది తీర్థయాత్రలను కేవలం వృద్ధాప్యంలోనే చేయాలి అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు! వయసుతో సంబంధం లేకుండా, మనసులోని కల్మషాలను తొలగించుకుని, దైవిక శక్తిని నింపుకోవడానికి తీర్థయాత్రలు ఒక అద్భుతమైన మార్గమని పండితులు సూచిస్తున్నారు.
అయితే ఈ యాత్రల సమయంలో కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. కాశీ ఖండం, పద్మ పురాణం వంటి గ్రంథాల్లో చెప్పిన కొన్ని ఆచారాలను అనుసరించడం మంచిదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.
తీర్థయాత్రలు ప్రారంభించే ముందు పాటించాల్సినవి
యాత్రను ప్రారంభించే ముందు దుర్ముహూర్తం లేదా వర్జ్యం లేని సమయాన్ని చూసుకుని ప్రయాణం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల అవరోధాలు తక్కువగా ఉంటాయని నమ్మకం ఉంది. కొందరు భక్తులు యాత్ర ప్రారంభ సమయంలో కొబ్బరికాయ కొట్టి, హనుమంతుని స్మరించుకుంటూ ప్రార్థన చేయడం ఆనవాయితీగా పాటిస్తారు.
ప్రయాణ సమయంలో ఆచరించాల్సిన నియమాలు
ప్రయాణ సమయంలో శివుని స్మరణ లేదా రుద్ర సంబంధిత మంత్రాలు జపించడం ద్వారా యాత్ర సాఫీగా సాగుతుందని పండితులు విశ్వసిస్తారు. యాత్ర పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి బంధువులతో కలిసి భోజనం చేయడం కూడా ఒక శుభాచారంగా భావిస్తారు. గుడి దర్శన సమయంలో ముందుగా క్షేత్ర పాలకుడిని దర్శించడం కొంతమంది సంప్రదాయంగా పాటిస్తారు. ఆ తర్వాత ప్రధాన దేవుడి దర్శనం చేయడం ద్వారా ఆలయ అనుభవం మరింత సంపూర్ణమవుతుందని భావిస్తారు.
నదీ స్నానాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నదీ స్నానాల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. శుభ్రమైన వస్త్రాలు ధరించడం, స్నాన సమయంలో అధికంగా సబ్బులు లేదా షాంపూలు ఉపయోగించడం నివారించాలని చెబుతున్నారు. అలాగే నదిలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని హెచ్చరిస్తున్నారు. సముద్ర స్నానాలు కూడా నిర్దిష్ట పర్వదినాలు లేదా అనుకూల సమయాల్లో చేయడం మంచిదని నమ్మకం ఉంది. యాత్ర సమయంలో దేవాలయాల గురించి అపహాస్యంగా మాట్లాడకూడదని, భక్తి భావం నిలుపుకోవాలని పెద్దలు చెబుతారు.
సాత్విక జీవన విధానం
అలాగే కొన్ని సంప్రదాయాల ప్రకారం బ్రహ్మచర్యం పాటించడం, సాత్విక ఆహారం తీసుకోవడం వంటి నియమాలు ఆధ్యాత్మిక శుద్ధికి సహాయపడతాయని భావిస్తారు. మొత్తం మీద తీర్థయాత్రలు కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభవంగా, మనసును శాంతింపజేసే ఒక శుభకార్యంగా పరిగణించబడతాయి.
Read Also: దర్శనం తర్వాత గుడిమెట్లపై కూర్చుంటున్నారా?.. ఆశ్చర్యపరిచే నిజం ఇదే!
Follow Us On: X(Twitter)

