కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకే సమయం.. వేర్వేరు సందర్భాలు.. కానీ సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ పోస్టింగ్‌ల యుద్ధం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు (Vijayamma Birthday) సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి.
విజయమ్మ పుట్టినరోజు (Vijayamma Birthday) సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం చర్చనీయాంశమైంది. సరిగ్గా అదే సమయంలో, తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జగన్ ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మరోవైపు, ఊహించని విధంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ఈ వ్యవహారంలోకి ప్రవేశించారు. రాజకీయంగా తమకు వైరుధ్యం ఉన్నప్పటికీ, విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఫొటోతో సహా లోకేశ్ మెసేజ్ పోస్ట్ చేశారు. జగన్ తన తల్లిని విస్మరించినట్లు కనిపిస్తున్న తరుణంలో, లోకేశ్ స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే అటు జగన్ పవన్ కోసం, ఇటు లోకేశ్ విజయమ్మ కోసం పోస్టులు పెట్టడం గమనార్హం.
షర్మిల, జగన్ మధ్య నడుస్తున్న ఆస్తి వివాదంలో విజయమ్మ తన కుమార్తె వైపు నిలబడటంతో, జగన్ ఆమెకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్ మీడియాలో విష్ చేయలేదని కొందరు భావిస్తుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. తల్లికి శుభాకాంక్షలు చెప్పడానికి సోషల్ మీడియానే వేదిక కావాలా.., నేరుగా ఫోన్లోనో లేదా కలిసి కూడా శుభాకాంక్షలు చెప్పి ఉండవచ్చని వారు వాదిస్తున్నారు. అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేయడం సరికాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా, ఈ ట్విట్టర్ పోస్టులు మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

