డీలిమిటేష‌న్‌కు మ‌ద్దతు.. జ‌గన్‌ను ఏకిపారేసిన ష‌ర్మిల‌!

క‌లం, వెబ్ డెస్క్‌: లోక్‌స‌భ‌లో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన డీలిమిటేష‌న్ బిల్లు (Delimitation Bill)కు వైసీపీ మ‌ద్ద‌తివ్వ‌డంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) త‌న కేసుల నుంచి ర‌క్ష‌ణ కోస‌మే ఎన్డీఏ పంచెన చేరార‌ని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా షర్మిల ఓ పోస్ట్ చేశారు. జ‌గ‌న్‌కు దేశ రాజ్యాంగ రక్ష‌ణ కంటే మోడీ భ‌జ‌నే ముఖ్య‌మంటూ సెటైర్లు వేశారు. బీజేపీతో ద‌త్త పుత్రుడు వైఎస్ జ‌గ‌న్ పెట్టుకున్న అక్ర‌మ పొత్తు ఈ వ్య‌వ‌హారంతో బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. టీడీపీ, జ‌న‌సేన‌ల కంటే ఎక్కువ‌గా జ‌గ‌న్ మోడీని మోస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు జ‌గ‌న్ సిగ్గుపడాల‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. వైసీపీ పాల‌న‌లో చేసిన అవినీతి కోస‌మే బీజేపీతో అంట‌కాగుతున్నార‌న్నారు. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా అని ప్ర‌శ్నించారు. బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా? అని నిల‌దీశారు.

జ‌గ‌న్ చెప్పే వైఎస్ఆర్ ఆశ‌యాలు, వార‌స‌త్వం ఇదేనా? అంటూ ష‌ర్మిల మండిప‌డ్డారు. మహానేత సిద్ధాంతాలను మంట గలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాల‌న్నారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే, ఏం సాధించారని ప్రశ్నించడం తీవ్ర హాస్యాస్పద‌మ‌ని పేర్కొన్నారు. దొంగ బిల్లులకు ఓటేసి మీరేం సాధించార‌ని ప్ర‌శ్నించారు. కోట్లాది మంది రాష్ట్ర‌ ప్రజల హృద‌యాల‌ను గాయపరచడం మీరు సాధించిన గొప్పతన‌మా అని ప్ర‌శ్నించారు. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాన్ని అర్థం చేసుకోలేక‌పోయార‌ని విమ‌ర్శించారు.

ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. జగన్ చేసిన నీచపు పనికి వైఎస్ఆర్ ఆత్మ ఘోషిస్తోంద‌న్నారు. మహిళా బిల్లును, డీ లిమిటేషన్‌కి లింక్ పెట్టడం జగన్ అవివేకానికి నిదర్శన‌మ‌ని విమ‌ర్శించారు. న్యాయం జరగలేదని, సాకారం కాలేదని మీరే అంటున్నారా లేక మోడీ మీచేత కూడా చెప్పించారా? అని ప్ర‌శ్నించారు. మహిళల 33 శాతం రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాద‌ని, అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవరికీ లేద‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్యత ఒకటేన‌ని, 2023లోనే మహిళా బిల్లు పాస్ అయ్యింద‌ని ష‌ర్మిల వెల్ల‌డించారు. ఇప్పుడు విప‌క్షాలు అడ్డుకుంటున్న‌ది కేవ‌లం మోడీ లబ్ది కోసం పెట్టిన డీ లిమిటేషన్ బిల్లును మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై, మహిళా రిజర్వేషన్లపై (Women Reservation) కాంగ్రెస్ స్టాండ్ స్ప‌ష్టంగా ఉంద‌న్నారు.

ఇక 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య తేలాల‌న్నారు. కులాల ఆధారంగా డీ లిమిటేషన్‌లో రిజర్వేషన్లు పాటించాల‌ని సూచించారు. వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న‌ 543 పార్ల‌మెంట్‌ స్థానాలకు మహిళా రిజర్వేషన్లు పాటించాల‌ని కోరారు. చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని సమ్మతమైన పరిష్కారం చూపాల‌ని సూచించారు. అధికారిక గణాంకాలు లేకుండా 50 శాతం పెంచి దేశాన్ని ఉద్ధరిస్తున్నామని బీజేపీ చెప్తే జగన్ సైతం గుడ్డిగా నమ్మడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేన‌న్నారు. ఏపీలో బీజేపీ అంటే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైఎస్ జ‌గ‌న్‌లేన‌ని, వీరి మూడు పార్టీలు మోడీ మెప్పుకోరే పార్టీలేన‌ని, ప్రతిపక్షం అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేన‌ని ష‌ర్మిల (YS Sharmila) అన్నారు.

Read Also: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ భారీ స్కామ్.. !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>