కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇటీవల రామ లక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ తనను తాను క్రిస్టియన్ నాస్తికుడిగా పిలుచుకుంటూనే, తన తల్లి అంత్యక్రియల సమయంలో ఆమె విశ్వాసాలను గౌరవించడం ఒక కొడుకుగా మంచి పద్ధతేనని నాగబాబు పేర్కొన్నారు. అయితే అదే స్ఫూర్తితో కోట్లాది మంది ప్రజల నమ్మకాలను కూడా గౌరవించాలని ఆయన హితవు పలికారు. నాస్తికత్వం అంటే దేవుళ్లని లేదా భక్తులను వెక్కిరించడం కాదని, అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానమని.. కేవలం హిందూ ధర్మం మాత్రమే నాస్తిక వాదాన్ని కూడా తనలో భాగంగా అంగీకరిస్తుందని నాగబాబు గుర్తు చేశారు.
అంతేకాకుండా, ఇటువంటి గొప్ప సంప్రదాయాన్ని కించపరచడం హేతుబద్ధత అనిపించుకోదని, అది కేవలం అగౌరవపరచడమేనని నాగబాబు మండిపడ్డారు. ఇతర దేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేదని హెచ్చరించారు. గౌరవప్రదంగా ప్రవర్తించని వ్యక్తులతో తాను భవిష్యత్తులో వాదించబోనని స్పష్టం చేశారు. అందరి నమ్మకాలను గౌరవించడమే నిజమైన బాధ్యత అని నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతకు ముందు రోజు సైతం నాగబాబు ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్‌గా ఓ పోస్ట్ చేశారు. రాముడు హిందువులకు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదని, ఆయన ధర్మం, సత్యం, న్యాయాలకు మరో రూపమని పేర్కొన్నారు. రాముడిని అవమానించడం తక్కువ చేయడం సరి కాదని చెప్పారు. కొంత మంది అహంకారంతో, అజ్ఞానంతో వచ్చే అంధత్వంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ధర్మం ఎప్పటికీ నశించదని, దాన్ని కాపాడే వారు కూడా వెనుకడుగు వేయరని నాగబాబు అన్నారు. చరిత్రలో ధర్మానికి విరుద్ధంగా వెళ్లిన వారిని కాలమే నాశనం చేసిందని చెప్పారు. అలాగే రాముడిపై ద్వేషంతో మాట్లాడేవారికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు.

