కలం, నిజామాబాద్/మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో కరువు కోరలు (Telangana Drought) చాస్తున్నది. ఎల్ నినో ప్రభావంతో అన్ని జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. చెరువులు, కుంటలు వెలవెలబోతుండగా.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోగా.. ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బకెట్లు, ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి మరీ భగీరథ యత్నాలు చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖరీఫ్ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
దిక్కుతోచని స్థితిలో ఇందూరు రైతులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 36.4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్, జులై నెలల్లో వర్షాల కారణంగా భూగర్భ జలమట్టాలు పెరగాల్సి ఉండగా.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మే నెలలో సగటున 11.68 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు జులై నాటికి 12.61 మీటర్ల లోతుకు పడిపోయాయి. ప్రధాన జలాశయాలైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటిమట్టాలు పెరగడం లేదు. నిజామాబాద్ జిల్లాలో సుమారు లక్షకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. సిరికొండ, నిజామాబాద్, ధర్పల్లి, భీంగల్, వేల్పూర్, మోర్తాడ్, డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. దీంతో పంటలకు నీరు అందక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్ల ద్వారా నీటిని తెచ్చి మరీ పంటలకు అందిస్తున్నారు. వరి నారుమళ్లను కాపాడుకునేందుకు అదనపు ఖర్చులు భరిస్తున్నారు.
పాలమూరులో సాగు సంక్షోభం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు కేవలం 25 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. గతేడాది జూన్ నెలలోనే చెరువులు, కుంటలు నిండిపోగా.. ఈ ఏడాది జులై ముగుస్తున్నా నీటి జాడ కనిపించడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణంగా వానాకాలంలో 21,32,465 ఎకరాల్లో సాగు జరుగుతుంది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు కేవలం 8,08,834 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే మొత్తం సాగులో కేవలం 37.92 శాతం మాత్రమే పూర్తయింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలోనూ లక్షల ఎకరాలు బీడుగా మిగిలాయి. వర్షాలు లేకపోవడంతో పత్తి మొక్కలు మోడువారే పరిస్థితి ఏర్పడింది. వరి నారుమళ్లు ముదిరిపోతుండగా, కొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి. వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరిగి చెరువులు నిండే పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే సాగు మరింత కష్టతరంగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతుల ఆవేదన
వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన చంద్రయ్య అనే రైతు తెలిపారు. అయితే చెరువుల్లో నీళ్లు లేక ఇప్పటికీ చాలా మంది నాట్లు వేయలేదని వెల్లడించారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని వాపోయారు. మరోవైపు కామారెడ్డి జిల్లా కోర్పోల్ గ్రామ రైతు సాయిరాం మాట్లాడుతూ.. వర్షాలు లేక ఆందోళనలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులు వచ్చేశాయని పేర్కొన్నారు. నారు వేసి నాట్లు వేసి నీళ్ల కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

