కలం, తెలంగాణ బ్యూరో : “కాంగ్రెస్ పార్టీ (Telangana Congress)లో ప్రజాస్వామ్యం ఎక్కువ.. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు.. అధిష్టానానిదే అల్టిమేట్ డెసిషన్”.. తరచూ ఇలాంటి మాటలు ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి వినిపిస్తూ ఉంటాయి. పార్టీలో ఎన్ని గ్రూపులున్నా, ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా, కొన్నిసార్లు వివాదాస్పదంగా మారినా, పార్టీ ప్రతిష్టను డ్యామేజ్ చేసేలా కామెంట్లు చేసినా నాయకత్వం నుంచి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ అవుతుంటాయి. కానీ, ఆ తర్వాత చర్యలు ఉండవనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నది. ఇప్పటివరకు చాలా మందికి పార్టీ షోకాజ్‌లు జారీ చేసినా.. వారి నుంచి వచ్చే వివరణ దగ్గరే కథ ముగుస్తున్నదన్న భావన నెలకొంది.
హద్దులు దాటే కాంగ్రెస్ నేతలకు షోకాజ్ ఇవ్వడం ఆ పార్టీలో ఆనవాయితీ. రాష్ట్రంలో రెండున్నరేండ్ల కింద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందరో లీడర్లకు షోకాజ్ నోటీసులు వెళ్లాయి. కానీ, చర్యలు మాత్రం లేవ్! పేరుకే షోకాజ్ నోటీసులు తప్ప.. వాటితో ‘ఏమీ కాదులే’ అనే ధోరణి చాలా మంది హస్తం నేతల్లో నెలకొంది. ఈ ధోరణి వల్లే కొందరు చీటికిమాటికి వివాదాలకు కారణమవుతున్నారు. ఫలితంగా పార్టీకి చెడ్డపేరు వస్తున్నదని మరికొందరు అంటున్నారు. ఒకవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలు సీనియర్లు కావడం, మరికొన్ని సందర్భాల్లో వారి క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల చర్యలు తీసుకోవడానికి నాయకత్వం ఆచితూచి అడుగేస్తున్నది.
ఢిల్లీ హైకమాండ్ కే జవాబుదారీ అనీ..!
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకత్వం కంటే ఢిల్లీలోని హైకమాండ్ మాత్రమే తమకు జవాబుదారీ అని చాలామంది సీనియర్ నేతలు భావిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఏ అసంతృప్తి వచ్చినా, అవసరాలు కావాలన్నా హైకమాండ్‌ను సంప్రదించడం ఆనవాయితీ. కాంట్రవర్సీ కామెంట్లు చేసిన నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వారి నుంచి వివరణ కోరడాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీ చూసుకుంటున్నది. నాయకత్వం సంతృప్తి చెందకపోతే ఎవరో ఒక సీనియర్‌తో కమిటీ వేసి ఇరుపక్షాలతో మాట్లాడే యాక్టివిటీ చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఆ నాయకుడు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మందికి షోకాజ్ నోటీసులు జారీ అయినా చివరికి ఎవరిమీదా చర్యలు తీసుకోకపోవడంతో “ఏమీ కాదులే..” అనే ధోరణి నేతల్లో పెరిగిందనే మాటలూ గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి.
ప్రత్యర్థికంటే ఇంటిపోరే ఛాలెంజ్
ప్రతిపక్షాల మీద కొట్లాడాల్సిన టైమ్‌లో పార్టీలోని అంతర్గత విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు, వర్గపోరు విషయం మీద కాంగ్రెస్ నాయకత్వం దృష్టి కేంద్రీకరించాల్సి వస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి.. షోకాజ్ నోటీసులు అందుకున్న పలువురిని పిలిచి ముఖాముఖి చర్చించారు. వారి నుంచి వివరణ తీసుకున్నారు. జిల్లాల్లోని గ్రూపు పాలిటిక్స్, వర్గ పోరు, పరస్పర దూషణలు.. వీటన్నింటినీ ఆమె సీరియస్‌గా తీసుకున్నారు.
పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లాగా ఉండాలని నాయకత్వం పదేపదే చెప్తున్నా అది కానరాకపోవడంతో జిల్లా పార్టీ అధ్యక్షులను, అందుబాటులో ఉన్న మంత్రులను, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలను పిలిచి దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాలను రాజకీయంగా ఢీకొట్టడంకంటే సొంత పార్టీలోని విభేదాలను చక్కదిద్దడానికే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి వస్తున్నది. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం సంగతేమోగానీ సమన్వయం నెలకొల్పడం నాయకత్వానికి సవాల్‌గా మారింది.
పరిష్కరించాల్సిన లీడర్లే వివాదాల్లో..!
కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లోని నేతల మధ్య విభేదాలు వచ్చినప్పుడు.. సీనియర్లుగా, మాజీ మంత్రులుగా పనిచేసినవారు అప్పుడప్పుడూ పరిష్కరించే బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక ఆడియో రావడంతో దాని ఆధారంగా ఆయనకు క్రమశిక్షణా కమిటీ నోటీసు జారీ చేసింది. పార్టీ ప్రతిష్టకు, నాయకత్వానికి భంగం కలిగించే విధంగా కామెంట్స్ చేశారన్నది ఆయనపై అభియోగం.
షబ్బీర్ అలీ నుంచి కమిటీ వివరణ తీసుకున్నది. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ స్వయంగా పీసీసీ చీఫ్ స్పందించడం.. ‘వ్యాఖ్యల వక్రీకరణ’, ‘అసలు ఉద్దేశం వేరు’ అనే అంశాలు తెరమీదికి రావడంతో చర్యలు తీసుకోలేదు. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ.. “నోటీసులు జారీ చేసిన తర్వాత సస్పెన్షన్, బహిష్కరణ, పదవుల నుంచి, బాధ్యతల నుంచి తొలగించడం వంటి కఠిన చర్యలు లేకపోవడంతో నేతల్లో ‘వివరణ ఇస్తే సరిపోతుంది… చివరికి ఏమీ కాదు’ అనే భావన బలపడింది..” అని ఓ నేత వ్యాఖ్యానించారు.
కఠిన చర్యలకు వెనుకంజ
క్రమశిక్షణ తప్పిన నేతలపై కఠిన చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్ నాయకత్వం ఆచితూచి అడుగేస్తున్నది. రాజకీయంగానే దీనికి పలు కారణాలున్నాయి. సామాజిక సమీకరణలు అందులో ప్రధానమైనది. మరొకటి సీనియారిటీ, ఇన్ఫ్లూయెన్స్ ఉన్న నేతలు. చర్యలు తీసుకుంటే అనుచర వర్గాల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందనేది ఇంకో కారణం. గతంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అసంతృప్తి నేతలను దూరం చేసుకోవడం పార్టీకి ఇష్టం లేక సైలెంట్‌గా ఉండిపోయింది.
విభేదాలను పూర్తిగా అణచివేయడం కంటే మాట్లాడి పరిష్కరించడానికే ప్రాధాన్యం ఇవ్వాలనే పార్టీ లైన్ కూడా ఇంకో కారణం. షోకాజ్ నోటీస్ ఇచ్చి వదిలేయడంతో.. ఇదే అలుసుగా మరికొందరు కూడా బహిరంగంగా విమర్శలు చేసే వాతావరణం నెలకొంటున్నదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అధికార పార్టీలోని ఇలాంటి అంశాలు కూడా ప్రతిపక్షానికి రాజకీయ ఆయుధంగా మారుతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ.. మరోవైపు రాజకీయ సమీకరణ.. ఇందులో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది కాంగ్రెస్ నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది.
షోకాజ్ నోటీసులు అందుకున్నవాళ్లలో కొందరు..!
• షబ్బీర్ అలీ: ఒక ఆడియోలో పార్టీ పదవులు డబ్బులకు అమ్ముతున్నారనే వ్యాఖ్యలపై..! వ్యాఖ్యలను వక్రీకరించారు.. అసలు ఉద్దేశం వేరు.. అనే వివరణతో మేటర్ క్లోజ్.
• కత్తి వెంకటస్వామి: టీవీ చర్చలో సీఎం రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేసినందుకు..! ‘వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుంది..’ అనే వివరణతో సర్దుబాటు.
• శివచరణ్ రెడ్డి: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు..! షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను. ‘నాకు అగౌరవ పర్చాలనే ఉద్దేశం లేదు.. బాధపడి ఉంటే క్షమించండి’ అని శివచరణ్ రెడ్డి వివరణతో క్లోజ్.
• హరి ప్రసాద్, కృష్ణ కిశోర్: మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ. వివరణలు పంపారు.. అక్కడితో ఆ వ్యవహారం ముగింపు.
• ఎమ్మెల్యే మందుల సామేలు: సూర్యాపేట జిల్లాలో పార్టీ మండల అధ్యక్షుల నియామకంలో తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, ఒరిజినల్ పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారంటూ కేడర్ రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉన్నదనే ఆరోపణలు.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పరిష్కార బాధ్యతలు. ఇద్దరినీ పిలిచి మాట్లాడి వివరణ తీసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు.
• మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి : దేవాదాయ మంత్రగా ఉన్నా తనకు సమాచారం ఇవ్వకుండా కమిషనర్‌తో రివ్యూ చేశారంటూ సీఎం, పీసీసీ చీఫ్, ఏఐసీసీకి మంత్రి లేఖ. నియోజకవర్గంలోని ఆలయాల గురించి మాట్లాడానంటూ కడియం శ్రీహరి వివరణ.. మీనాక్షి నటరాజన్‌తో మంత్రి భేటీ.

