కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన శుభపరిణామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జి డా.అశోక్ కుమార్‌తో పాటు ఇతరు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, చంద్రబాబు (Chandrababu) పాలనపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన తో మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని జగన్ చెప్పారు. వైసీపీ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామన్న జగన్.. పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు మహిళలకు చట్టసభల్లో మరిన్ని సీట్లు రాబోతున్నాయని .. ఈ సీట్లు పెరగడం వల్ల వైసీపీ కార్యకర్త నాయకులుగా ఎదుగుతారని వెల్లడించారు. పార్టీలో పటిమ చూపించే వారికి, కష్టపడే వారికి పెద్దపీట వేస్తామని.. జగన్ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని నొక్కి చెప్పారు.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పేరు చెప్పి కూటమి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతుందని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే వంటనూనె ధరలు లీటర్‌కు రూ.4౦ వరకు.. పప్పుల ధర కిలోకి రూ.15లకు పైగా పెంచేశారని మండిపడ్డారు.మొక్కజొన్న, కోకో, శెనగ, అరటి, టమోటా పంటలకు మద్ధతు ధర లేదన్నారు. బ్లాక్‌లో సిలిండర్లను రూ.2 వేలకు, రూ.3వేలకు అమ్ముతూ.. ఇప్పుడు కిరోసిన్ ఇస్తామని అంటున్నారని చెప్పుకొచ్చారు.ఇప్పుడు కొత్తగా కిరోసిన్ స్టౌవ్‌లు కొనుక్కోవాలా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో చంద్రబాబు క్రెడిట్ దోపిడి చేస్తున్నాడని ఆరోపించారు. 2022లో దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ తనతో సమావేశమయ్యారని.. కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామంటే తమ ప్రభుత్వమే ఆహ్వానించిందని వివరించారు.

