ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి (MD Nagi Reddy) ప్రకటించారు. ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన “పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా..!” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరొద్దని.. సేఫ్ గా బస్సు ఎక్కి సుఖవంతమైన ప్రయాణం చేయాలని నాగిరెడ్డి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. సిటీ ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ట్రాఫిక్, పెట్రోల్ ఇబ్బందుల నుండి బయటపడాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని ఆయన వివరించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు.

సమయం & ఇంధనం ఆదా … క్యూ లైన్లకు స్వస్తి:

పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ (TGSRTC) బస్సులే మేలని పేర్కొన్నారు.

ఇంధన పొదుపు – దేశాభివృద్ధికి మలుపు:

ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదేనని చెప్పారు. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని వివరించారు.

పర్యావరణానికి మేలు – కాలుష్య రహిత ప్రయాణం:

రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని.. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు.

జేబుకు హాయి – ప్రయాణం సుఖవంతం:

సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30% రాయితీ ఒక గొప్ప అవకాశమని ఆయన తెలిపారు. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుందని చెప్పారు.

Read Also: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు.. కవిత కీలక డిమాండ్

Follow Us On: X(Twitter)

 

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>