కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ డ్రైవర్ల పై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం వరంగల్ (Warangal) జిల్లాలో బస్సు ఆపలేదని ఓ ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. పర్వతగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న బస్సు అన్నారం గ్రామం పెద్దతండా వద్ద ఆపలేదని యువకులు డ్రైవర్ తో గొడవ పెట్టుకున్నారు. బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు బస్సుకు అడ్డంగా నిలబడి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. అనంతరం డ్రైవర్ పై చేయి చేసుకుని దర్భాషలాడినట్లు తెలుస్తోంది. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై స్పందించిన ఆర్టీసీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.

