కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం-వాజేడు (Bhadrachalam – Wazeedu) ప్రాంత ప్రజల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఈ కీలక ప్రధాన రహదారి అభివృద్ధి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 48 కోట్ల భారీ నిధులను మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల ప్రత్యేక చొరవ, నిరంతర కృషి ఫలితంగా ఈ నిధులు మంజూరయ్యాయి.
ఈ నిధులకు సంబంధించిన అధికారిక జీఓ ప్రతులను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చీమలమర్రి మురళితో కలిసి బుధవారం ట్రైనీ కలెక్టర్ మురళికి అందజేశారు. ఈ సందర్భంగా నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, రహదారి అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల చిరకాల ఆకాంక్ష అని, దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతాల రవాణా కష్టాలు తీరనున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో, అధికారులు తక్షణమే స్పందించి పనులను ప్రారంభించాలని కోరారు. ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోపు ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే భద్రాచలం, వాజేడు పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు, స్థానిక వాణిజ్యం, పర్యాటక రంగం గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి సరికొత్త బాటలు పడుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

