కలం, వెబ్ డెస్క్: వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో, వ్యక్తిగత స్వేచ్ఛనో.. కారణాలు ఏమైనా ఈతరం యువతలో చాలామంది సహజీవనం (Live In Relationships) వైపు అడుగులు వేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో బాధ్యతలను తప్పించుకునేందుకు సహజీవనంపై ఆసక్తి చూపుతున్నారు. వీటి వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతోంది.
రాష్ట్రంలో UCC (ఉమ్మడి పౌర స్మృతి)పై అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఉత్తరాఖండ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల తరహాలోనే సమగ్రమైన చట్టాన్ని తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. ఈ నూతన చట్టం ప్రకారం.. సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్)లో ఉండే జంటలు తమ వివరాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బంధం నుంచి విడిపోవాలనుకుంటే అధికారికంగా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడం కూడా నిబంధనల్లో భాగం చేయనున్నారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించి, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సహజీవనం (Live In Relationships) సాగిస్తే గరిష్ఠంగా మూడు నెలల వరకు జైలు శిక్ష విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే విడిపోయిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మహిళా భాగస్వామికి పురుషుడు భరణం (మెయింటెనెన్స్) చెల్లించేలా ముసాయిదాలో నిబంధనలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రభుత్వం చట్టబద్ధం చేసే అవకాశం ఉందని సమాచారం.

