కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padbhanabam) భౌతికకాయానికి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నివాసానికి వెళ్లిన జగన్.. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో వైఎస్ జగన్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ముద్రగడ పద్మనాభం పాడెను మోసారు. ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు కడసారి వీడ్కోలు పలికారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. దీనిని ముద్రగడ కుటుంబసభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని.. ఇప్పడు అధికారిక గౌరవాలు అవసరం లేదని తెలిపారు.

