Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కలం, చండూరు: నల్లగొండ (Nalgonda)జిల్లాలోని చండూరు (Chandur) మండలంలో ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ విద్యుత్ తీగలు ప్ర‌జ‌ల‌కు యమపాశాలుగా మారుతున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే చండూరు మండల పరిధిలోని షిర్ధపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడికి విద్యుత్ తీగలు తగిలి ప్ర‌మాదానికి గురైతే చికిత్స చేసి మోచేతి వరకు తీసేశారు. ఆ సంఘటన జరిగి నెలలు గడవకముందే మండల పరిధిలోని చొప్పరి వారిగూడెంలో మ‌రో విషాద‌క‌ర ఘ‌ట‌న జ‌రిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మండల పరిధిలోని చొప్పరి వారి గూడెం గ్రామానికి చెందిన చొప్పరి చందు(20)విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం వద్దకు వెళుతుండగా విద్యుత్ వైర్లు తగిలిన‌ట్లు స‌మాచారం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే చందు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద కొన్ని రోజుల నుండి చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నాయని, ఈ సమస్యను ప‌రిష్క‌రించాల‌ని విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే చందు మృతి చెందాడని, ఈ నిర్లక్ష్యానికి కారణమైన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చేతికందిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబమంతా కన్నీరు మున్నీరుగా విల‌పిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>