కలం, నల్లగొండ : చిట్యాల (Chityala) పురపాలక పరిధిలో కోతులు, వీధికుక్కల దాడులు తీవ్రతరం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలో రోజురోజుకూ కోతులు, కుక్కల సంఖ్య పెరిగిపోయి సామాన్య ప్రజలు, చిన్నారులు, వృద్ధులపై దాడులకు తెగబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కోతులు, వీధికుక్కల స్వైరవిహారం వలన ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో సంచరిస్తున్న కోతులను వెంటనే పట్టుకుని దూరంగా ఉన్న అటవీ ప్రాంతాలకు తరలించాలని, వీధికుక్కల సంతతిని, దాడులను నియంత్రించడానికి మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుక్కలు, కోతుల దాడుల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వం వెంటనే ఉచిత వైద్య సదుపాయం కల్పించడంతో పాటు తగిన నష్టపరిహారం అందించాలని పేర్కొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ అధికారులకు అందజేశారు. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు తక్షణమే స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

