కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో(Korutla) పట్టపగలు ఆర్టీసీ బస్సు (RTC Bus) చోరీ ఘటన కలకలం రేపింది. బస్టాండ్‌లో పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సును గుర్తుతెలియని వ్యక్తి అపహరించి నిజామాబాద్ వైపు తీసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. కోరుట్ల బస్టాండ్‌లో కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సును డ్రైవర్ ప్రవీణ్ పార్కింగ్ చేశాడు. డ్రైవర్ టీ తాగేందుకు బయటకు వెళ్లిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దుండగుడు బస్సును స్టార్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లాడు.
కొంతసేపటి తర్వాత బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్ గమనించి వెంటనే బస్సును వెంబడించాడు. వేగంగా బస్సు నడిపిన దుండగుడు మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొట్టడంతో నలుగురు బైక్‌దారులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మెట్‌పల్లి నుంచి బస్సును వెంబడించారు. పోలీసులు, డ్రైవర్ కలిసి చేసిన చేజింగ్‌లో జిల్లా సరిహద్దు గండి హనుమాన్ దేవాలయం సమీపంలో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అనంతరం పోలీసులు బస్సును అపహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో విద్యార్థులు లేదా ప్రయాణికులు ఉన్నట్లయితే భారీ ప్రమాదం జరిగేదని ఆవేదన వ్యక్తం చేశారు.

