టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. గిల్ ఆందోళన ఇదే!

కలం, స్పోర్ట్స్ : ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమి కంటే ఆటగాళ్ల వరుస గాయాలే తనను ఎక్కువగా కలవరపెడుతున్నాయని చెప్పారు. గాయాల కారణంగా తాము అనుకున్న జట్టుతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. లార్డ్స్‌లో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్, మొదట ప్రకటించిన జట్టులోని కనీసం ఐదుగురు ఆటగాళ్లు చివరి మ్యాచ్‌లో ఆడలేదని చెప్పారు. ప్రతి మ్యాచ్‌కు ముందు కొత్త గాయాలు రావడంతో జట్టు కాంబినేషన్‌ను పదేపదే మార్చాల్సి వచ్చిందని తెలిపారు.

వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని గిల్ అన్నారు. వరల్డ్‌కప్‌లో వరుసగా 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం తమ ఆటగాళ్లు రెండు లేదా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా పూర్తి చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. జట్టుగా ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీమిండియాకు కీలక ఆటగాళ్లు అయిన హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు.

వాషింగ్టన్ సుందర్ కూడా గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా కూడా రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేకపోవడంతో యువ బౌలర్లతో బరిలోకి దిగాల్సి వచ్చింది. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు కీలక ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించడం టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. గాయాల సమస్య నుంచి జట్టు ఎంత త్వరగా బయటపడుతుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>