కలం, మహబూబ్ నగర్ బ్యూరో: విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. తన సొంత నిధులతో నిర్వహిస్తున్న శతశాతం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో నూతనంగా నియమించిన విద్యా వాలంటీర్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
పిల్లలపై దృష్టి పెట్టాలి..
పిల్లలను చిన్న వయస్సు నుంచే గమనిస్తూ వారి ఆలోచనా విధానం, ప్రవర్తన, చదువుపై ఆసక్తి వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. సరైన సమయంలో పిల్లలపై దృష్టి పెట్టకపోతే వారు చెడు మార్గం వైపు వెళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే విద్యా వాలంటీర్ల వ్యవస్థను ప్రత్యేకమైన బాధ్యతతో రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యా వాలంటీర్లు కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారా, హోంవర్క్ చేస్తున్నారా, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తున్నారా, వారి ప్రవర్తన ఎలా ఉంది, చదువులో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే అంశాలను నిరంతరం గమనించాలని సూచించారు.
టీచర్లతో పంచుకోవాలి..
ఉపాధ్యాయులకు సిలబస్ పూర్తి చేయడం, పాఠ్య ప్రణాళికలు రూపొందించడం, పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ నివేదికలు సమర్పించడం వంటి అనేక బాధ్యతలు ఉంటాయని చెప్పారు. అలాంటి సమయంలో విద్యా వాలంటీర్లు విద్యార్థులను ప్రత్యేకంగా గమనించి వారి ప్రతిభ, సమస్యలు, ఆలోచనా విధానం వంటి అంశాలను ఉపాధ్యాయులతో పంచుకోవడం ద్వారా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చన్నారు. విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే సబ్జెక్టుపై అవగాహన, కాన్సెప్ట్‌పై పట్టు కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. అందుకే 3డీ యానిమేషన్లు, డిజిటల్ లెర్నింగ్, యానిమేటెడ్ పుస్తకాలు, డిజిటల్ బోర్డులు వంటి ఆధునిక పద్ధతులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
సాంకేతికతను విద్యలో సమర్థవంతంగా వినియోగించడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, ఆలోచనా శక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రయోగాత్మక విధానాల ద్వారా పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం కూడా మెరుగుపడిందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో చిన్నచిన్న మార్పులు తీసుకురావడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచవచ్చని, అందుకే మూస పద్ధతులకు భిన్నంగా పరిశోధనాత్మకంగా, నిరూపితమైన విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యా వాలంటీర్ల కార్యక్రమాన్ని తొలుత 35 మందితో నిర్వహించి మంచి ఫలితాలను సాధించామని తెలిపారు.
100 మంది విద్యా వాలంటీర్లతో..
ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం 100 మంది విద్యా వాలంటీర్లతో మరింత విస్తృత స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో ప్రారంభించిన ఈ మోడల్ భవిష్యత్తులో రాష్ట్రస్థాయి, దేశస్థాయి మోడల్‌గా నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యా వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాలకు సబ్జెక్ట్ నిపుణులు, ఉపాధ్యాయులు ఎంతో దూరం నుంచి వచ్చి శిక్షణ అందించారని ఆయన తెలిపారు.
తెల్లవారుజామునే ప్రయాణించి శిక్షణా శిబిరాలకు హాజరై విద్యార్థులకు బోధించి, వారి సందేహాలను నివృత్తి చేస్తున్న నిపుణులు, ఉపాధ్యాయుల సేవలను ఆయన అభినందించారు. “మన పిల్లల భవిష్యత్తు కోసం మనం చేస్తున్న కార్యక్రమంగా భావించి ఉపాధ్యాయులు, విద్యా వాలంటీర్లు, సబ్జెక్ట్ నిపుణులు అందరూ సంపూర్ణ సహకారం అందించారని, ఈ సమిష్టి కృషితో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న విద్యా వాలంటీర్ల వ్యవస్థ మోడల్‌ను దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తాం” అని అన్నారు.
ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం..
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. విద్యా వాలంటీర్ల కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమమని అన్నారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఫలితాలు ఒక్క రోజులో సాధ్యం కావని, అయితే ఫలితాలు వచ్చినప్పుడు అవి ఎంతో గొప్ప అనుభూతి అందిస్తాయని చెప్పారు. ఒక గ్రామం నుంచి ప్రారంభమయ్యే విద్యా విప్లవం మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం మొత్తం అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. మహిళలను విద్యా వాలంటీర్లుగా నియమించడం ద్వారా నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ మరింత పటిష్టంగా, సురక్షితంగా ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ సుధాకర్ రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

