విద్యతోనే భవిష్యత్ తరాలకు బలమైన పునాది: విప్ యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: విద్య ద్వారానే భవిష్యత్ తరాలకు బలమైన పునాది పడుతుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు చేపడుతోందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో విద్యారంగంలో అనేక ప్రయోగాత్మక కార్యక్రమాలను చేపడుతున్నామని విప్ యెన్నం తెలిపారు. డిజిటల్ లెర్నింగ్, టెక్స్ట్ బుక్స్, స్టూడియో, 3డీ యానిమేషన్ల ద్వారా విద్యార్థులకు పాఠాలను సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. డిజిటల్ బోర్డులను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని 100 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించామన్నారు. గతంలో 30 పాఠశాలల్లో 35 మంది విద్యా వాలంటీర్లను నియమించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

ఏఐ సాంకేతితతో బోధిస్తూ..

విద్యార్థులకు కేవలం మార్కులు, ఉత్తీర్ణత సాధించడమే కాకుండా వారి సామర్థ్యాలు, ఆసక్తులు, బలాలు, బలహీనతలను గుర్తించి భవిష్యత్తులో వారికి సరైన దిశానిర్దేశం చేయడమే లక్ష్యమని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఏఐ సాంకేతికతను వినియోగించే ప్రయోగాన్ని కూడా చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని వివరించారు. విద్యార్థుల్లో ప్రతిభకు లోటు లేదని, వారికి సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను విద్యారంగంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం..

కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం అన్నారు. ఉపాధ్యాయుల కృషి వల్లే అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులు తయారవుతున్నారని పేర్కొన్నారు. 30 నుంచి 40 మంది విద్యార్థులకు రోజూ ఓర్పుతో బోధిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలను ఆమె కొనియాడారు.

జిల్లాలో సుమారు 69 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందిస్తున్నా.. ప్రతి ఉపాధ్యాయుడు ఈ గౌరవానికి అర్హుడేననని కలెక్టర్ తెలిపారు. అనంతరం వారికి పురస్కారాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత, విద్యాశాఖ అధికారి విజయకుమారి, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి విష్ణునందన్, ఎఎంఓడీ శ్రీనివాస్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>