కలం, ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు పీఎం శ్రీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చేపట్టిన ఎక్స్పోజర్ విజిట్ (Exposure Visit) కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 80 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ఐఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులతో కూడిన బస్సు సర్వీసులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ ఎక్స్పోజర్ విజిట్ అవకాశాన్ని ఒక సువర్ణ అవకాశంగా భావించి, పర్యటనలో కొత్త విషయాలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు ఇలాంటి విహార, విజ్ఞాన యాత్రలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సద్వినియోగాన్ని విద్యార్థులు ఆనందంగా గడపాలని సూచించారు. పర్యటన పూర్తిస్థాయిలో సురక్షితంగా సాగేలా చూసే బాధ్యత వెంట వెళ్తున్న ఐఆర్పీలు, ప్రత్యేక ఉపాధ్యాయులపై ఉందని, అందరూ క్షేమంగా తిరిగివచ్చు అనుభవాలను పంచుకోవాలని ఆకాంక్షించారు.

