కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో గల సిగరెట్ షాప్‌లో తాళాలు పగులగొట్టి సుమారు రూ.5.35 లక్షల విలువైన సిగరెట్ బాక్సులు, నగదు చోరీ చేసిన రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు (Adilabad Police) అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితులు కుమావత్ బుందారం, కుమావత్ ఘనశ్యామ్, కుమావత్ మాణిక్ చంద్, కుమావత్ లక్ష్మణ్, తేజ్‌పాల్ సింగ్ ముందుగా సిగరెట్ షాప్ వద్ద రెక్కీ నిర్వహించారు.
అనంతరం రాత్రి సమయంలో గడ్డపార, హ్యాండిల్ సహాయంతో షాప్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి వివిధ రకాల సిగరెట్ బాక్సులతో పాటు కౌంటర్లోని నగదును అపహరించారు. చోరీ చేసిన సిగరెట్లలో కొంత భాగాన్ని హైదరాబాద్‌లోని పఠాన్‌చెరు ప్రాంతంలో విక్రయించేందుకు ప్రయత్నించారు. మిగిలిన సిగరెట్ బాక్సులను విక్రయించడంతో పాటు ఆదిలాబాద్‌లో మరో చోరీకి పాల్పడేందుకు తిరిగి వచ్చిన నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.60 వేల నగదు, కారు, నాలుగు సెల్ఫోన్లు, గడ్డపార, హ్యాండిల్‌తో పాటు వివిధ రకాల సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులపై గతంలోనే ఏడు అంతర్రాష్ట్ర చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ – హైదరాబాద్ హైవే పరిధిలో కూడా చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు.

