పర్యావరణ పరిరక్షణకు కృషి: విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ, విద్యా ప్రగతికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తెలిపారు. ఎదిర అయిదో డివిజన్‌లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమానికి విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఊర చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ ఎదిర’ లోగోను ఆవిష్కరించారు. అనంతరం చెరువు కట్టపై మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు.

విద్యార్థులకు సంరక్షణ బాధ్యత..

ఈ సందర్భంగా విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థులు కలసికట్టుగా చెట్లు నాటి వాటికి విద్యార్థుల పేర్లు పెట్టి, వాటి సంరక్షణ బాధ్యతను అప్పచెప్పడం అభినందనీయమన్నారు. చెరువు కట్టపై సేద తీరేందుకు పార్టీలకు అతీతంగా గ్రామస్థులు సొంత డబ్బులతో బెంచీలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్న నేటి పరిస్థితుల్లో అత్యధిక చెట్లు నాటడం అత్యవసరమని తెలిపారు.

స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు.

ఐటీ పార్క్ (IT Park) వంటి కంపెనీల కోసం గ్రామస్థులు భూములు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రతిఫలంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విప్ తెలిపారు. అమర్ రాజా వంటి పరిశ్రమలతో మాట్లాడి ఇప్పటికే కొందరికి ఉద్యోగాలు ఇప్పించామని చెప్పారు.

మహబూబ్ నగర్ ఐఐఐటీ కళాశాలలో 200 సీట్లకు గాను 140 మంది విద్యార్థులు ఉమ్మడి జిల్లా విద్యార్థులే ప్రవేశాలు పొందారని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో సౌకర్యాలు పెంపు, కొత్త ఉపాధ్యాయుల నియామకం, పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం అమలు వంటి చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

మౌలిక వసతుల అభివృద్ధి..

గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల భవనాలు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) చెప్పారు. రాజకీయ నాయకులంటే దౌర్జన్యాలు, భూకబ్జాలు చేయడం, అమాయకులను బెదిరించడం కాదన్నారు. గ్రామ అభివృద్ధి, విద్యా పురోగతి, యువత భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం పదో తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, కార్పొరేటర్లు బి.లలిత భాను చందర్, పెద్ద గొల్ల నర్సింహులు, నాయకులు మైత్రి యాదయ్య, చంద్రకాంత్ రెడ్డి, హన్మంతు, నాగన్న, జాజిమొగ్గ నర్సింహులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హేమ చంద్రుడు పాల్గొన్నారు.

Read Also: టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై కవిత లేఖ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>