కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న డాక్టర్ విజయానంద రెడ్డి పాలమూరు జిల్లాలో జన్మించడం జిల్లాకే గర్వకారణమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) కొనియాడారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రాజా బహదూర్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డా. పాలకొండ విజయానంద రెడ్డి ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.
పాలమూరు రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డా. విజయానంద రెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. క్యాన్సర్ రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు ఆయనకు లభించడం జిల్లాకు గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో ఆయన చూపుతున్న అంకితభావం, సేవా తపన విశేషమని కొనియాడారు.
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న రోగులకు నూతన ఆశను నింపుతూ వేలాది మంది ప్రాణాలను కాపాడడంలో విజయానంద రెడ్డి చేసిన సేవలు అపారమని ఎమ్మెల్యే (Yennam Srinivas Reddy) కొనియాడారు. ఆయన వైద్య సేవలు కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి వారికి పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం ఎంతో గర్వకారణమని చెప్పారు. మహబూబ్ నగర్ ప్రాంతానికే కాకుండా ప్రతి తెలుగు వారికి ఇది ఆనందదాయకమైన విషయమని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం జిల్లా యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ఆయన ఉదాహరణగా నిలుస్తారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆయన మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించి, పేద ప్రజలకు అందుబాటులో వైద్య సేవలను అందించాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, రెడ్డి సేవా సంఘం సభ్యులు ఇంద్రసేనారెడ్డి, మల్లు నర్సింహ్మారెడ్డి, మద్ది అనంత రెడ్డి, మద్ది యాదిరెడ్డి, శ్రీరామ ఇంజనీరింగ్ కంపెనీ అధినేత బెక్కెరి రామిరెడ్డి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జె.రాంమోహన్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On: Instagram

