కలం, నిర్మల్ : పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Nirmal Collector) మాట్లాడుతూ.. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రతి విడతలో మళ్లీ చుక్కలు వేయించడం ద్వారా పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లాలో ఒక్క చిన్నారి పోలియో చుక్కలు (Pulse Polio) మిస్ కాకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
పోలియో రహిత నిర్మల్ జిల్లా లక్ష్యంగా ప్రతి ఇంటికి అవగాహన కల్పించి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని, ప్రజలు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On: Instagram

