కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వేసవి సెలవులు ముగిసే సమయం కావడంతో స్వామివారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుంచి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు గడిచిన 24 గంటల్లో సుమారు 1,15,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సెలవుల నేపథ్యంలో ఉచిత దర్శనం చేసుకునే సామాన్య భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సులభంగా దర్శనం కల్పించడమే ధ్యేయంగా ఆలయ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రోటోకాల్ దర్శనాలను కేవలం వీఐపీలకే పరిమితం చేశారు. భక్తుల ( Devotees) రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, అధికారులు తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల దర్శనాలు సజావుగా సాగాయి.
ఒక్క రోజే రూ. 71.70 లక్షల భారీ ఆదాయం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్కరోజే స్వామివారికి వివిధ రకాల పూజలు, టికెట్లు, సేవల ద్వారా మొత్తం రూ. 71,70,982 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారికి 3300 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ. 25,20,330, వీఐపీ దర్శనం (రూ. 150/-): రూ. 16,97,250, బ్రేక్ దర్శనం: రూ. 7,11,900, కొండపైకి వాహన ప్రవేశం: రూ. 6,44,000, ప్రధాన బుకింగ్: రూ. 4,08,600, యాద రుషి నిలయం: రూ. 3,15,730, సత్యనారాయణ వ్రతాలు: రూ. 2,63,000, కళ్యాణకట్ట: రూ. 1,65,000, సువర్ణ పుష్పార్చన: రూ. 1,47,000, గరుడ ట్రస్ట్: రూ. 1,01,000 ఆదాయం సమకూరింది. వీటితోపాటు పాతగుట్ట ద్వారా రూ. 62,390, సుప్రభాతం ద్వారా రూ. 29,900, వాహన పూజల ద్వారా రూ. 16,700 ఆదాయం సమకూరగా.. మిగిలిన ఇతర విభాగాలు, ల్యాకర్లు, ప్రచార శాఖ, అన్నప్రసాదం ద్వారా మిగతా ఆదాయం వచ్చినట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

