కలం, ఖమ్మం బ్యూరో: అంతర్రాష్ట్ర గంజాయి (Ganja) స్మగ్లింగ్ ముఠాపై ‘ఈగల్’ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. 18 నెలలపాటు నిఘా ఉంచి భారీ అంతర్రాష్ట్ర గంజాయి ముఠా ఆట కట్టించింది. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు, వారి నుంచి రూ. కోటి విలువైన 200 కిలోల గంజాయి, వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఈ ముఠా కదలికలపై ఈగల్ ఫోర్స్ నిఘా పెట్టారు. గతంలో నల్గొండలో 336 కిలోల గంజాయితో పట్టుబడిన మహారాష్ట్రకు చెందిన అమోల్ గోరే అనే నిందితుడి నెట్‌వర్క్‌ను గమనిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జూన్ 7న ఈ ముఠా ఒడిశా సరిహద్దుల నుంచి భారీగా గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది.
సమాచారం అందిన వెంటనే నిందితులను వెంటనే పట్టుకోకుండా, మొత్తం నెట్‌వర్క్‌ను కనిపెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చివరకు ఖమ్మం (Khammam) రీజియన్ పరిధిలోని కొణిజర్ల పోలీసుల సహాయంతో రంగంలోకి దిగి ముఠాను చుట్టుముట్టారు. మెరుపు దాడి చేసి వాహనాలను తనిఖీ చేయగా 200 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ కేసులో మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అమోల్ నానోబా గోరే, లక్ష్మణ్ నాగ్‌నాథ్ కరేలతోపాటు వారికి సహకరించిన కామారెడ్డికి చెందిన వసంత జాదవ్, షేక్ అన్సార్, షేక్ రహ్మత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. సరుకును స్వీకరించే మహారాష్ట్రకు చెందిన ప్రభు, ఒడిశాకు చెందిన దేవి సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులపై ఇసుక మాఫియా నిర్వాహకులు దాడికి తెగబడటం, ఆపై పోలీస్ సిబ్బందిని లారీతో ఢీకొట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘోర ప్రమాదంలో కానిస్టేబుల్, హోంగార్డు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై బూర్గంపాడు సబ్ ఇన్స్పెక్టర్ స్పందిస్తూ.. లారీని నడిపిన డ్రైవర్‌తో పాటు, ఇసుక నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

