యాదగిరిగుట్ట దేవస్థానంలో తీవ్ర విషాదం

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆలయ వేద పండితుడు వేణుగోపాలాచార్యులు బుధవారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆలయ విధుల్లో ఉన్న సమయంలో వేణుగోపాలాచార్యులు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గమనించిన తోటి దేవస్థాన సిబ్బంది వెంటనే స్పందించి, ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన పరిస్థితి విషమించింది. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

వేణుగోపాలాచార్యుల అకాల మరణం పట్ల యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) భవాని శంకర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వామివారి సేవలో సుదీర్ఘకాలం ఉంటూ, వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక సేవలు అందించిన ఆయన మరణం యాదగిరిగుట్ట దేవస్థానానికి తీరని లోటు అని ఈవో కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు వేద పండితుడి మరణవార్త తెలియగానే యాదగిరిగుట్ట ఆలయ సిబ్బంది, తోటి అర్చకులు, వేద పండితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. భువనగిరి ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్న దేవస్థాన సిబ్బంది, వేణుగోపాలాచార్యుల భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>