కలం, మెదక్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రంలోని అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) వ్యవసాయ మార్కెట్ యార్డులో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కన్నపేట మండలంలోని వివిధ ఐకేపీ కేంద్రాల్లో తూకం వేసిన వరి ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా హుస్నాబాద్ యార్డుకు తరలించగా, ఇక్కడి సిబ్బంది దించుకునేందుకు నిరాకరించారు. కేవలం హుస్నాబాద్ పరిధిలోని రైతుల ధాన్యాన్ని మాత్రమే అన్ లోడ్ చేస్తున్నారని, అధికారులు ఆదేశించినా సిబ్బంది పట్టించుకోవడం లేదని అక్కన్నపేట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
నాలుగురోజులుగా మార్కెట్ యార్డులోనే..
అక్కన్నపేట మండలం నుంచి వచ్చిన రైతులు నాలుగు రోజులుగా వ్యవసాయ మార్కెట్ యార్డులోనే తిండీతిప్పలు లేక పడిగాపులు కాస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివక్షను, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులంతా ఏకమై హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు.
భారీగా ట్రాఫిక్ జామ్
రైతుల ఆందోళనతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్స అయ్మాయింది. సమాచారం అందుకున్న ఎస్సై పీ లక్ష్మారెడ్డి పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని, అందరి ధాన్యాన్ని అన్ లోడ్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సై సర్దిచెప్పడంతో రైతులు నిరుత్సాహంతోనే తమ ధర్నాను విరమించారు. ధాన్యం కొనుగోళ్లలో స్థానిక, పక్క మండలాలనే భేదం చూపకుండా అందరినీ సమానంగా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మళ్లీ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

