కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం క్యాడర్ స్ట్రెంత్‌లో ఖాళీగా ఉన్న వివిధ మతపరమైన పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకై అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 10వ, 11వ తేదీల్లో ఉదయం 08 గంటల నుండి భువనగిరిలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి వాట్సాప్ సామాజిక మాధ్యమం ద్వారా, అలాగే వారి వ్యక్తిగత మొబైల్ ఫోన్లకు సమాచారం అందించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈనెల 10వ తేదీన పరిచారిక (మెయిన్ టెంపుల్), అసిస్టెంట్ పాచక (రామానుజకూటం), డోలు, శృతి, అసిస్టెంట్ పాచక (బ్రాహ్మణ సత్రం), 11వ తేదీన పరిచారిక (శివాలయం), సన్నాయి, తాళం, అసిస్టెంట్ పాచక (అన్నదానం), అసిస్టెంట్ పాచక (ప్రసాదం) సంబంధిత పోస్టుల స్వభావాన్ని అనుసరించి అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్ష, మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూ) నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ నియమ నిబంధనల ప్రకారం నియమించబడిన సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ytdexam.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు సమయంలో నమోదు చేసిన మొబైల్ నంబర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో వీలుపడని వారు నేరుగా దేవస్థానం ప్రధాన కార్యాలయంలో డిస్పాచ్ విభాగము నుండి హాల్ టికెట్లను పొందవచ్చునని సూచించారు.

