కలం, వలిగొండ: శాంతి భద్రతలను కాపాడడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. శుక్రవారం వలిగొండ (Valigonda) పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతి భద్రతలు కాపాడటంలో రాజీ పడకూడదని ఆదేశించారు. పెట్రోలింగ్, ప్రజల ఫిర్యాదులపై సిబ్బందికి కీలక సూచనలు చేశారు. స్టేషన్‌లోని రిసెప్షన్ కౌంటర్, క్రైమ్ విభాగం, జనరల్ డైరీ నిర్వహణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోల్ కార్లు, ‘బ్లూ కోల్ట్స్’ వాహనాల స్థితిగతులను, వాటిలోని సైరన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరును పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. నిర్ణీత సమయంలో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే సహాయం అందించాలని, అర్హత గల ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేయకూడదన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ యుగేందర్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

