ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆటిజం వ్యాధిని 1980 సంవత్సరంలో గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం 2022లో 50 మంది ఆటిజం బారిన పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆటిజం అనేది మానసిక వ్యాధి కాదని స్పష్టం చేశారు. ఇది పిల్లల ప్రవర్తన, సంభాషణ, సామాజిక సంబంధాలపై ప్రభావం చూపే ఒక అభివృద్ధి సంబంధిత పరిస్థితి అని వివరించారు. ముఖ్యంగా 15 నుంచి 18 నెలల మధ్యే లక్షణాలను గుర్తిస్తే, వైద్యుల సలహాలు తీసుకుని పిల్లలతో ప్రేమగా, సహనంతో మెలిగితే మంచి మార్పు తీసుకురావచ్చని చెప్పారు.
ఆటిజం లక్షణాలుగా పిల్లలు ఒంటరిగా ఉండడం, ఇతరులతో కలవకపోవడం, మాట తక్కువగా మాట్లాడడం, పదేపదే ఒకే పనిని చేయడం, కొత్త వ్యక్తులతో కలిసిపోకపోవడం వంటి లక్షణాలను గుర్తించాలని సూచించారు. తల్లిదండ్రులు ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరమని అన్నారు. అలాగే, తల్లి ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, గర్భధారణ సమయంలో తీసుకునే జాగ్రత్తలు కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు వివరించారు.
ప్రస్తుతం ఆటిజం ధ్రువీకరణ పత్రాలు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి సిద్ధయ్య మాట్లాడుతూ, ఆటిజం ఉన్న పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో బోధన అందిస్తున్నామని చెప్పారు. వారి ప్రవర్తనను అర్థం చేసుకుని, వారికి అనుకూలంగా విద్యాబోధన, యోగా, ఆటలు, పాటలు, నృత్యం వంటి కార్యక్రమాల ద్వారా వారి ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.