కలం, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల (Munagala) మండల కేంద్రంలో కలెక్టర్ సమక్షంలోనే ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ (Tejas Nandlal Pawar), జిల్లా ఎస్పీ నరసింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న సమయంలో తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా కలెక్టర్ ఎదుటే పురుగుల మందు తాగింది.
మునగాల (Munagala) మండలంలోని తాడ్వాయి గ్రామం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పైలెట్ ప్రాజెక్ట్‌కు ఎంపికైంది. సునీత పేరుపై ఇల్లు మంజూరైనప్పటికీ, దాన్ని మరొకరికి కేటాయించారని ఆమె ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తాను అర్హురాలైనా పథకం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నాయకుల జోక్యంతో సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని ఆమె విమర్శించారు. సునీత పురుగుల మందు తాగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను తక్షణమే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స అందుతోంది. ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: షాకింగ్.. భారీగా పెరిగిన సబ్బుల ధరలు
Follow Us On : WhatsApp

