దమ్మపేట రోడ్డుకు ఫోర్ లైన్ హంగులు

కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలలో  భాగంగా మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni) ప్రత్యేక చొరవతో పాల్వంచ పట్టణ పరిధిలోని దమ్మపేట(Dammapeta) రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. పాల్వంచలోని దమ్మపేట సెంటర్ నుంచి కుంటినాగులగూడెం వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర ఆధునిక సౌకర్యాలతో ఫోర్ లైన్ రహదారి నిర్మించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక రహదారి నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్ల నిధులను మంజూరు చేసింది.

ఈ రహదారి నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, అశ్వారావుపేట వైపు రాకపోకలు సాగించే వాహనదారులకు కూడా ఎంతో ఉపశమనం కలగనుంది. అంతేకాకుండా దమ్మపేట సెంటర్‌లో చాలాకాలంగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ ఫోర్ లైన్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రెయిన్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిరంతరం కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దమ్మపేట రోడ్డు అభివృద్ధికి నిధుల మంజూరు కావడంపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>