కలం, జనగామ: మగబిడ్డను వారసుడిగా చూపించాలనే దురాశతో ఓ మహిళ చేసిన కిడ్నాప్ యత్నం జనగామ జిల్లా మాతృ శిశు ఆరోగ్య కేంద్రం (Jangaon MCH)లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపల్లి మండలం మల్లంపల్లికి చెందిన తల్లపల్లి (శాగా) జ్యోతికి మొదటి భర్త ద్వారా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భర్త మరణానంతరం శాగా సురేష్‌ను రెండో వివాహం చేసుకుంది. సురేష్‌కు కూడా మొదటి భార్య ద్వారా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చిన జ్యోతికి, మళ్లీ ఆడపిల్లే పుడుతుందని తెలియడంతో భర్తకు తెలియకుండా గర్భస్రావం చేయించుకుంది. అయితే, భర్తను నమ్మించేందుకు మగబిడ్డను తన సంతానంగా చూపించాలని పథకం వేసింది.
బుధవారం సాయంత్రం MCH ఆసుపత్రికి వెళ్లిన జ్యోతి, “డైపర్ మారుస్తాను”, “పాలు తాగిస్తాను” అని అక్కడి సెక్యూరిటీని నమ్మించి వార్డులోకి ప్రవేశించింది. అక్కడ ఏడుస్తున్న ఒక మగబిడ్డను ఎత్తుకుని ఆటోలో పరారయ్యేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన శిశువు బంధువులు ఆమెను వెంటాడి పట్టుకున్నారు. శిశువును సురక్షితంగా స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆసుపత్రిలోని భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

