ఖజానాపై ఉద్యోగుల జీతాల భారం.. నెలకు ఆరు వేల కోట్లు

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల వేతనాల భారం (Telangana Salary Expenditure) గుదిబండగా మారింది. ఒకవైపు వారి జీతభత్యాలను (Employees Salaries) మోయలేక సతమతమవుతున్నది. మరోపక్క ఉద్యోగుల నుంచి పెండింగ్ డీ.ఏ.లు, పీఆర్సీ ఫిట్‌మెంట్, రిటైర్‌మెంట్ (Retirement) బెనిఫిట్స్ వెంటాడుతున్నాయి. వివిధ పన్నుల (Taxes) రూపంలో ప్రతి నెలా ఆర్జిస్తున్న సొంత ఆదాయంలో సగం ఉద్యోగుల జీతాలకే పోతున్నది. గతేడాది నుంచి కొత్తగా రిక్రూట్ అయిన 67 వేల మంది ఎంప్లాయీస్‌కు కూడా జీతాలు చెల్లించాల్సి వస్తున్నది. నెలకు సగటున ఐదారు వేల కోట్ల మేర ఈ రూపంలోనే ఖర్చు చేయాల్సి వస్తున్నదనేది ఆర్థికశాఖ వర్గాల వాదన. ఖాళీ పోస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కంప్లీట్ కావడంతో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాల సంఖ్య దాదాపు 27 వేలు పెరిగినట్లు సూచనప్రాయంగా తెలిపారు.

అత్యధిక వేతనాలతో ఆర్థిక కష్టాలు :

దేశంలో అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. ప్రతి నెలా ఉద్యోగులకు దాదాపు నాలుగైదు వేల కోట్ల మేర జీతాలకు (Telangana Salary Expenditure) ఖర్చవుతున్నదని, తాజాగా చేరిన 67 వేల మంది ఉద్యోగులతో ఇది ఐదారు వేల కోట్లకు చేరుకున్నదని ఆర్థిక శాఖ వర్గాలు గుర్తుచేశాయి. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో దాదాపు 27 వేలు ఈ రెండేండ్లలోనే కొత్తగా జీపీఎఫ్ ఖాతాలు ఓపెన్ అయ్యాయని గుర్తుచేశాయి. రాష్ట్రంలో బోగస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నట్లు గుర్తించిన రాష్ట్ర సర్కార్ అన్ని విభాగాల హెడ్‌ల నుంచి వివరాలను తెప్పించుకున్నది. వాటిని ఆధార్ కార్డుల అనుసంధానంతో బోగస్ ఉద్యోగుల ఏరివేత ప్రక్రియను చేపట్టింది. చివరకు ప్రక్షాళన జరగడంతో నిబంధనల ప్రకారం ఉన్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్క తేలడంతో జీపీఎఫ్ ఖాతాలు పెరిగినట్లు తేలింది.

సుమారు 40 వేల మంది బోగస్ ఉద్యోగులు :

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి సుమారు 40 వేల మంది బోగస్ ఉద్యోగులున్నట్లు ఈ ఏరివేత ప్రక్రియతో తేటతెల్లమైంది. చివరకు 4.96 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నట్లు స్పష్టమైంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలతో కూడిన సమగ్రమైన డేటా బేస్‌ను ఆర్థిక శాఖ ఫైనల్ చేసింది. ఇకపైన ఆన్‌లైన్‌లోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలన్నీ నమోదయ్యే కొత్త మెకానిజం ఉనికిలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్స్ అందరూ ఆయా కార్యాలయాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాల డేటాను ఆన్‌లైన్ ద్వారానే పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలతో సంబంధం లేకుండా సంబంధిత కార్యాలయాల అధికారుల నుంచే వివరాలన్నింటినీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సేకరించనున్నది. దీంతో బోగస్ ఉద్యోగుల నియామకానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ అధికారులే జవాబుదారీగా ఉండే సిస్టమ్ తయారైనట్లయింది.

Read Also: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలు విడుదల

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>