epaper
Tuesday, November 18, 2025
epaper

విజయ్ పొలిటికల్ ఎంట్రీ హిట్టా.. ఫట్టా?

కలం డెస్క్ : సినీరంగంలో హీరోగా హిట్టయిన విజయ్ రాజకీయంగా ఏమవుతారు?.. పేరుకు తగినట్లుగా విజయం సాధిస్తారా?.. విజయకాంత్ తరహాలో రాణిస్తారా?.. సంప్రదాయ ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా యూత్ ను ఆకట్టుకుని చరిత్ర సృష్టిస్తారా?.. లక్షలాదిమంది హాజరయ్యే బహిరంగ సభలు ఓట్లను కురిపిస్తాయా?.. తమిళనాడు పాలిటిక్స్ లో సినీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?.. ఇలాంటి అనేక చర్చలు ఇప్పుడు తమిళనాట జోరుగా సాగుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు :

తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎన్నికలపై విశ్లేషణలు ఊపందుకున్నాయి. సినీ రంగంలో ‘దళపతి’గా గుర్తింపు పొంది హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు. కొన్ని నెలల క్రితమే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే – తమిళనాడు విజయ పార్టీ) భవిష్యత్తు మరో ఆరు నెలల్లో తేలిపోనున్నది. గతంలో కమల్ హాసన్, టీ.రాజేందర్, శరత్ కుమార్, శివాజీ గణేశన్.. ఇలా చాలా మంది సినీ నటులు రాజకీయ పార్టీలు పెట్టినా రాణించలేకపోయారు. విజయకాంత్ తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయినా ఆ తర్వాత పుంజుకుని జయలలిత హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాణించారు. ఇప్పుడు విజయ్ భవిష్యత్తును రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నిర్ణయించనున్నాయి.

సెంటిమెంట్ అస్త్రం :

తమిళనాడు ద్రవిడ సిద్ధాంతంతో ప్రజాదరణ పొందిన నేతలు చాలా మందే ఉన్నారు. ఆ సెంటిమెంట్ ను వాడుకున్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు గతేడాది ఫిబ్రవరి 3న అన్నాదురై వర్ధంతి రోజున ప్రకటించారు. పార్టీ పేరులో ద్రవిడ అనే పదాన్ని చేర్చకపోయినా తమిళ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. గతంలో అనేక కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా వాటిల్లో ద్రవిడ అనే పదం ఉండేది. కానీ విజయ్ కొత్త ప్రయోగం చేశారు. తమిళనాడు చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు సినీ రంగం నుంచి వచ్చినవారే. అన్నాదురై (సినిమాల్లో మాటల రచయిత), కరుణానధి (పలు సినిమాలకు మాటలు రాశారు), ఎంజీఆర్ (సినీ హీరో), జయలలిత (సినీ హీరోయిన్), విజయకాంత్ (సినీ హీరో).. ఇలాంటి చాలా మంది సినీ రంగం నుంచి వచ్చినవారే. ఇప్పుడు వారి వరుసలో విజయ్ కూడా చేరారు.

అభిమాన సంఘాల ఒత్తిడి :

రాజకీయాల్లోకి రావడంపై చాలా ఏండ్లుగా ఊహాగానాలు వచ్చాయి. జయలలిత, కరుణానిధి మరణాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో వెలితి ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అభిమాన సంఘాల నాయకులు అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీ పెట్టాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటికే శివాజీ గణేశన్, కమల్ హాసన్, శరత్ కుమార్, సినీ దర్శకుడు సీమాన్ లాంటి పలువురు పార్టీలు స్థాపించినా సక్సెస్ కాలేకపోయిన అంశాన్ని వివరించారు. రాష్ట్రమంతటా గణనీయమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఇదే తరహా ఒత్తిడి వచ్చినా ఆయన సాహసం చేయలేదు. ఇప్పుడు విజయ్ తన భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు.

సందేశాత్మక చిత్రాల ప్రభావం :

సమాజంలోని అవినీతి, అక్రమాలు, అన్యాయం, ప్రజలకు న్యాయం దొరకకపోవడం, అశాంతి, అసంతృప్తి.. వీటిని బేస్ చేసుకుని విజయ్ అనేక సినిమాల్లో హీరోగా నటించారు. ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యలే ఇతివృత్తంగా ఉన్నాయి. మెర్సల్, కత్తి, కావలన్, తలైవన్, సర్కార్.. ఇలాంటి సందేశాత్మక సినిమాల్లో నటించారు. పవర్ ఫుల్ డైలాగులతో ప్రజల దృష్టిలో పడ్డారు. అభిమాన సంఘాల్లో ఉత్సాహం పెల్లుబికింది. అప్పట్లో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ లాంటి పార్టీల నేతల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ సవాళ్ళూ వచ్చాయి. ఇప్పుడు పొలిటికల్ పార్టీ నేతగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఆ సినిమాల్లోని డైలాగులు ఓట్లను కురిపిస్తాయో లేదా వేచి చూడాలి.

విజయ్ పార్టీకున్న బలం :

రాష్ట్రంలోని ఫస్ట్ టైమ్ ఓటర్లు, యువతపై టీవీకే ఆశలు పెట్టుకున్నది. ఇంతకాలం డీఎంకేకు కోటగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు ఆదుకుంటుందనే నమ్మకమున్నది. క్రిస్టియన్ గా ముద్ర పడినందువల్ల ఆ సెక్షన్ ఓట్లు పడతాయనే ధీమా వ్యక్తమవుతున్నది. ఇటీవల నిర్వహించిన సభలకు లక్షలాదిమందిగా తరలి రావడం ఆయనలో ఉత్సాహాన్ని నింపింది. వచ్చిన జనం, యూత్ ఓట్లు వేస్తారా?.. అభిమానం ఓట్ల రూపంలోకి మారుతుందా?.. ఇలాంటి చర్చలు మొదలయ్యాయి. ఇంతకాలం చూసిన రాజకీయ పార్టీల స్థానంలో కొత్త లక్ష్యాలతో వచ్చే టీవీకే పార్టీని జనం స్వాగతిస్తారా? డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ తదితర పార్టీలే టార్గెట్ గా రాజకీయ ప్రసంగాలు చేస్తుండడంతో వాటి ఓటు బ్యాంకును చీల్చగలమని టీవీకే ధీమాతో ఉన్నది. కరుణానిధి, జయలలిత మృతి తర్వాత ఏర్పడిన వెలితిని భర్తీ చేసుకోవచ్చని భావిస్తున్నది.

బలహీనతలు :

రాజకీయ పరిపక్వత లేకపోవడం, కొత్తగా ఎంట్రీ ఇవ్వడం, పరిపాలనా వ్యవహారాల్లో పరిజ్ఞానం కొరవడడం, చతురతను ప్రదర్శించడంలో మెలకువలు లేకపోవడం, టార్గెట్ చేసుకున్న పార్టీల నేతల విమర్శలను దీటుగా తిప్పికొట్టలేకపోవడం.. ఇలాంటివన్నీ విజయ్ బలహీనతలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే యూత్ కు కల్పించే ఉపాధి, పేదలను సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం, బలమైన రాజకీయ పార్టీలను ఎదుర్కొనే చాణక్యం.. ఇవి లేకపోవడం ఆయన బలహీనతలుగా ముద్ర పడ్డాయి.

ఏ పార్టీకి ముప్పు :

జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో నాయకుల మధ్య ఐక్యత కొరవడింది. ఆధిపత్య పోరు మొదలైంది. వర్గాలు, గ్రూపులుగా విడిపోయింది. కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది. దీంతో అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకు చీలి అనుకూలంగా మారుతుందనేది టీవీకే భావన. డీఎంకే ఓటు బ్యాంకుపై పడే ప్రభావం తక్కువే అయినా యూత్ ఆలోచనలో వచ్చే మార్పులు ఆదుకుంటాయని నమ్మకం పెట్టుకున్నది. పార్లమెంటు ఎన్నికలకంటే ముందే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చినా పోటీకి దూరంగా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుంటామని విజయ్ ప్రకటించారు. ఏ పార్టీ ఓట్లను చీలుస్తారు.. అది ఏ మేరకు ఫలితం ఇస్తుందనేది కీలకంగా మారింది. ఓట్ల శాతం సింగిల్ డిజిట్ దాటకపోవచ్చనే అంచనాలూ ఉన్నాయి.

విజయమా?.. ప్రయోగమా? :

విజయ్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడు రాజకీయాల్లో చర్చకు తావిచ్చే అంశంగా మారింది. ఆయన పార్టీ గెలుస్తుందా?.. ఓడిపోతుందా?.. ఎంత శాతం ఓటు బ్యాంకు పొందుతుంది?.. ఇలాంటి చర్చలు ఎన్ని ఉన్నా ఒక కొత్త పరిణామానికి కారణమైంది. సొంతంగా గెలుపు సంగతేమోగానీ డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకులో చీలిత తప్పదని, ఆ పార్టీల విజయాన్ని ప్రభావితం చేస్తుందని, రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందని, వివిధ పార్టీల మధ్య కొత్త సమీకరణాలకు కారణమవుతుందని.. ఇలాంటి విశ్లేషణలు ఉన్నాయి. మరో ఆరు నెలల్లో విజయ్ పొలిటికల్ ఫ్యూచర్ హిట్టా.. ఫట్టా.. అనేది తేలిపోనున్నది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>