కలం డెస్క్ : Telangana Local Body Elections | గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించినా అవి జరుగుతాయో లేదోననే సందేహం అన్ని పార్టీల్లో వ్యక్తమవుతున్నది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కానీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరుగుతున్నందున అక్టోబరు 8వ తేదీన వెల్లడయ్యే ఉత్తర్వుల తర్వాత ఎన్నికలపై స్పష్టత రానున్నది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటవద్దంటూ సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో (నెం. 42) ప్రకారం బీసీలకు 42%, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 27% చొప్పున రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో మొత్తం రిజర్వేషన్లు 69% అవుతున్నందున సుప్రీంకోర్టు గత ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు పేర్కొన్నారు.
అన్ని పార్టీల దృష్టీ అక్టోబరు 8 పైనే :
హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. రాష్ట్రప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 8న జరపనున్నట్లు పేర్కొన్నది. దీంతో ఈ పిటిషన్లపై జరిగే విచారణ సందర్భంగా 69% రిజర్వేషన్ ను ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుంది.. సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల ఉల్లంఘన జరగలేదనే వాదన ఏ తీరులో వినిపిస్తుంది.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ లేవనెత్తే అంశాలేంటి.. తదితరాలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందని, చట్టబద్ధత లేకుండానే ఎన్నికలకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు ప్రకటించిందన్న అభిప్రాయాలు పార్టీల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ ఎన్నికలు జరగకపోవచ్చనే అనుమానాలూ ఉన్నాయి. దీంతో హైకోర్టు ఇచ్చే క్లారిటీని బట్టి ఎన్నికలు జరుగుతాయో.. లేదో.. స్పష్టం కానున్నది.
మొదటి నుంచీ అనుమానం :
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలోని గణాంకాల ఆధారంగా బీసీల రిజర్వేషన్ ను ఖరారు చేసింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% ఉన్నదని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వారికి 42% రిజర్వేషన్ ను ఫిక్స్ చేశామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ, కౌన్సిల్ లో ప్రభుత్వం వేర్వేరు బిల్లులు పెట్టి అన్ని పార్టీల ఏకాభిప్రాయం మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ను ఖరారు చేసిందని సీఎం సహా మంత్రులు నొక్కిచెప్పారు. ఈ బిల్లుల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 69% అవుతుందని, రాజ్యాంగంలోని 9వ అధికరణానికి సవరలు చేసి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుపై సందేహాలు నెలకొన్నాయి.
పార్టీల బ్లేమ్ గేమ్ షురూ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన చట్టాలకు గవర్నర్ ఆమోదం లేకుండానే ప్రభుత్వం జీవో జారీ చేసి రిజర్వేషన్ ను ఖరారు చేయడాన్ని తప్పుపట్టాయి. ఈ ఎన్నికలు జరిగే అవకాశం లేదు.. పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటి నుంచే దసరా ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడొద్దు.. అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు చర్చకు దారితీయడంతో దానికి వివరణ ఇచ్చుకున్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ను కార్నర్ చేసేలా బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు రూపాల్లో ప్రయత్నిస్తుండగా ప్రజలకు ఇచ్చిన హామీని కార్యాచరణలో పెట్టామని అధికార పార్టీ సమర్ధించుకుంటున్నది. ఎన్నికలు జరగకపోతే ప్రభుత్వాన్ని నిందించేలా విపక్షాలు, ఈ ఎన్నికలను నిర్వహించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు కౌంటర్లు ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ ఫార్ములాపై హైకోర్టు ఎలాంటి స్పష్టత ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఈ ఎన్నికలు జరుగుతాయో.. లేదో తేలనున్నది.

