కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పురపోరు మొదలైంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగియగా మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) అంతా సిద్దం చేస్తున్నారు. అయితే ఏపీ (AP) లో కూడా లోకల్ బాడీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వేగంగా పనులు మొదలయ్యాయి. ఈ జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ఈసీ సిద్దమైనట్లు తెలుస్తుంది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ వంటి పనులు వేగవంతం చేసింది. రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల వ్యూహాల్లో బిజీగా మారాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
ఏపీలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుంది. కానీ అదే సమయంలో జనగణన కూడా మొదలు కానుంది. దీనితో పంచాయితీ, మున్సిపాలిటీల విభజన, విలీనం సాధ్యం కాదని తెలుస్తుంది. దీనితో జనగణన పూర్తి అయ్యాకే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. జనగణనకు ఆరు నుంచి ఏడు నెలలు సమయం పడుతుంది. దీనితో ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.


