కలం, వెబ్ డెస్క్: చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ కార్యవర్గ (BRS Legislature Party Meeting) సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమం జరగబోతున్నది. కేసీఆర్ (KCR) సుదీర్ఘ విరామం అనంతరం రాజకీయ కార్యక్రమంలో పాల్గొనబోతుండటం.. పార్టీ కార్యవర్గ సమావేశానికి వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వ సాగునీటి విధానాలపై కేసీఆర్ ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించడమే ఆయన వ్యూహం అని తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి రాబోతున్నారు. కేసీఆర్ ఆ మీటింగ్ లో ఏ మాట్లాడతారు? పార్టీ నేతలకు ఏమని దిశానిర్దేశం చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బీఆర్ఎస్ క్యాడర్‌తో పాటు రాష్ట్ర ప్రజలంతా ఈ మీటింగ్ గురించి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఆ ఎమ్మెల్యేలు వస్తారా?
బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లకు సంబంధించి ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారంతా ఐదుగురు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని ఆయన తేల్చి చెప్పారు. వారు పార్టీ మారారు? అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ ఈ ఐదుగురు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎటువంటి ఆధారాలు లేవని.. సాంకేతికంగా వారంతా బీఆర్ఎస్ సభ్యులేనని స్పీకర్ తేల్చారు. దీంతో ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి వస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వారు సమావేశానికి వచ్చినా బీఆర్ఎస్ నేతలు వారిని రానిస్తారా? లేదా? అన్నది మరో ప్రశ్న.
ఆ ఇద్దరి సంగతేంటి?
ఇక దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరి (Kadiyam Srihari) కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉన్నారు. దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఈయన పార్టీ మార్పుకు సంబంధించి బలమైన ఆధారం లభించినట్టైంది. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కడియం శ్రీహరి మాత్రం పత్రికా సమావేశం పెట్టి తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే వీరు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి (BRS Legislature Party Meeting) హాజరవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు..!
Follow Us On: X(Twitter)


